రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సమావేశానంతరం ఏలేటి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల గురించి హమీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త విషయాలను తెర పైకి తెస్తున్నారని ఆయన విమర్శించారు.
రాబోయే స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి, ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి, 18 నెలలు దాటిని పట్టించుకోకపోవడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చినా సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలపై, ఇంకా అనేక ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు.