అమరావతి: తనకు తెలుగు జాతే ముఖ్యమని, ఎన్ని జన్మలైనా ఇక్కడే పుడతానని ఎన్టిఆర్ ఆశయాలే టిడిపికి స్ఫూర్తి అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( chandra babu naidu) తెలిపారు. లోకేష్ ప్రవేశ పెట్టిన 6 శాసనాలు సరికొత్త చరిత్రకు నాంది అని అన్నారు. భవిష్యత్ తరాల కోసమే తెలుగుదేశం కుటుంబం 6 శాసనాలు అమలవుతయని చెప్పారు. ఈ సందర్భంగా కడపలో మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..40 శాతం మంది యువతకు గత ఎన్నికల్లో సీట్లిచ్చామని, ఇది చరిత్ర అని 61 మంది యువత ఎమ్మెల్యేలు, ఎంపిలుగా గెలిచారని అన్నారు. కార్యకర్తలే అధినేత అనేది ఇక టిడిపి సిద్ధాంతమని, 45 రోజుల్లో కోటికి పైగా సభ్యత్వం నమోదు చేసిన పార్టీ టిడిపి అని తెలియజేశారు. 2047 కు తెలుగుజాతిని ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉంచాలని చెప్పారు. 40 ఏళ్లకు రోడ్ మ్యాప్ నకు రూపకల్పన చేసుకున్నామని అన్నారు.
కోవర్టులను టిడిపిలోకి పంపితే మీ ఆటలు సాగవు అని ’’నేరస్తులు ఖబడ్దార్.. నా దగ్గర మీ ఆటలు సాగవు‘‘ అని హెచ్చరించారు. వలస పక్షులు వస్తాయని.. పోతాయని.. కార్యకర్త శాశ్వతంగా ఉంటారని చెప్పారు. ఆర్థికంగా టిడిపి కార్యకర్తలను అభివృద్ధి చేసేందుకు ఆలోచిస్తున్నాం అని అన్నారు. అభివృద్ధికోసం కూటమి ఐక్యంగా ఉండాలని చంద్రబాబు కోరారు. 2029 లో మరింత మెజార్టీతో కూటమిని గెలిపించాలని, గతంలో సోషల్ రీ ఇంజనీరింగ్ చేసిన మంచి ఫలితాలు సాధించామని ఆనందం వ్యక్తం చేశారు. దళితులు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చామన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా మహిళలను అభివృద్ధి చేస్తామని, లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేస్తామని తెలిపారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే తాట తీస్తామని చెప్పారు. ఆగష్టు 15 నుంచి ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమని, దీపం-2 కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని, అరకు కాఫీకి బ్రాండ్ క్రియేటివ్ చేస్తున్నామని, పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.