ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. వృధ్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కనకరత్నమ్మ అల్లుడు అయిన చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, కుటుంబం అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. రామ్‌చరణ్ మైసూర్ నుంచి, అల్లు అర్జున్ ముంబయ్ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చేశారు. కనకరత్నమ్మ మరణ వార్త తెలుసుకున్న అల్లు అరవింద్ సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. పలువురు సినీ ప్రముఖులు అల్లు అరవింద్‌కు ఇంటికి విచ్చేసి కనకరత్నమ్మ భౌతిక కాయానికి పూలతో నివాళులర్పించారు.
ఇక కోకాపేటలోని అల్లు అరవింద్ వ్యవసాయ క్షేత్రంలో అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు మెగా,- అల్లు కుటుంబాల అశ్రు నయనాల మధ్య ఆమె అంతిమ యాత్ర జరిగింది. ఇక కనకరత్నమ్మ పాడెను అల్లుడు అయిన చిరంజీవి, మనవళ్లు అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో పాటు ముని మనవడు అయాన్ కూడా మోశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే కనకరత్నమ్మకు ఇద్దరు మనవళ్లు అల్లు అర్జున్, రామ్‌చరణ్ అంటే ఎంతో ప్రాణం. ముఖ్యంగా అల్లు అర్జున్ అంటే ఎంతో ఇష్టం.