హైదరాబాద్: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఇంటిలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్, నాన్నమ్మ కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. తన తల్లి వయోభారంతో గత అర్థరాత్రి 1.45 గంటలకు తుదిశ్వాస విడిచారని అల్లు అరవింద్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. తన అత్త మృతి పట్ల చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతితో చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలిపారు. శనివారం కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహిస్తామని వివరించారు. మైసూర్ నుంచి రాంచరణ్, ముంబయి నుంచి అల్లు అర్జున్ కాసేపట్లో ఇంటికి చేరుకోనున్నారు. చిరంజీవి సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు రేపు అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలియజేస్తారు. అంత్యక్రియలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని భావిస్తున్నారు. శ్రద్ధాంజలి ఘటించేందుకు అల్లు, మెగా అభిమానులు భారీగా అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు అరవింద్ ఇంటి వద్ద భారీగా మోహరించారు. అల్లు రామలింగయ్య 2004 జులై 31 మృతి చెందారు. భర్త కన్నుమూసిన 21 సంవత్సరాల తరువాత భార్య కనకరత్నమ్మ చనిపోయారు.
Also Read: ట్రంప్ వినాయక చవితి కానుక