అల్వాల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్య నగర్ లో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసం పలు నేరాలు చేస్తూ గతంలో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన చింతకింది అనిల్ (36) అనే కరుడు గట్టిన పాత నేరస్థుడిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జోన్ డిసిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు.
ఈ నెల 3వ తేదీ రాత్రి నిద్రిస్తున్న కనకయ్య(70), రాజమ్మ (65)లను పక్కనే ఉన్న సెంట్రింగ్ కర్రతో తలలు పగలకొట్టి అనంతరం హత్య చేసి వారి ఒంటిపై ఉన్న నగలు, డబ్బులను ఎత్తుకెళ్లారు. 4వ తారీఖు ఫిర్యాదు అందుకున్న అల్వాల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధ దంపతుల వద్ద దొంగిలించిన 2సెల్ ఫోన్లు, బంగారు పుస్తెలు,150 గ్రాముల వెండి, 20 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.