ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో గురువారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్) సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో అమెరికాకు చెందిన యువ సంచలనం, 13వ సీడ్ అమందా అనిసిమోవా 64, 46, 64 తేడాతో సబలెంకను మట్టికరిపించింది. అసాధారణ ఆటతో అలరించిన అమందా చిరస్మరణీయ విజయంతో కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకుంది. ఆరంభం నుంచే అమందా దూకుడైన ఆటను కనబరిచింది. టాప్ సీడ్ సబలెంకపై ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగింది. తన మార్క్ షాట్లతో అరినాపై పట్టు సాధించింది. సబలెంక కూడా తన మార్క్ ఆటతో ముందుకు సాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డి పోరాడారు. దీంతో పోరులో ఉత్కంఠ తప్పలేదు.
కానీ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన అనిసిమోవా తొలి సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో సెట్‌లో కూడా పోరు నువ్వానేనా అన్నట్టుగానే సాగింది. ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. అయితే తొలి సెట్‌లో చేసిన పొరపాట్లకు తావులేకుండా ఈసారి సబలెంక చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచింది. ఇదే క్రమంలో సెట్‌ను సొంతం చేసుకుంది. మూడో సెట్ ఆరంభం నుంచే అమందా దూకుడైన ఆటతో అలరించింది. సబలెంకకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్షం దిశగా అడుగులు వేసింది. తీవ్ర ఒత్తిడికి గురైన సబలెంక వరుస తప్పిదాలకు పాల్పడింది. ఒక దశలో 41 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో సబలెంక అనూహ్యంగా పుంజుకుంది. అమందాపై ఎదురుదాడి చేస్తూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని 54కు తగ్గించింది. కానీ కీలక సమయంలో అమందా మళ్లీ ఎటాకింగ్ గేమ్‌తో సబలెంకపై విరుచుకు పడింది. ఒత్తిడిని తట్టుకుంటూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.