పాక్ సామూహిక విధ్వంసక ఆయుధాలు, చైనా లింక్ ప్రస్తావన
భారత్ కు చైనా ప్రథమ శత్రువు, పాక్ మరో శత్రువు అన్న యుఎస్
ప్రపంచ నాయకత్వ పాత్ర పెంచుకునే కృషిలో భారత్
రక్షణ రంగ ప్రాధాన్యతతో ప్రపంచనాయకుడుగా అవతరిస్తున్న మోదీ
వాషింగ్టన్ డిసి: పాకిస్తాన్ భారతదేశాన్ని తన అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తుండగా, భారత్ చైనాను ప్రథమ శతృవుగా, పాకిస్తాన్ ను మరో శతృవుగా, భద్రతకు ముప్పుగా పరిగణిస్తున్నదని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది. 2025లో ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్న అంశాలపై అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ నివేదిక రూపొందించింది. భారత ప్రధాని నరేంద్రమోడీ రక్షణ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో ప్రపంచ నాయకుడుగా అవతరిస్తున్నారని, చైనా ను ఎదుర్కొనే దృష్టితో భారత్ ను బలమైన సైనిక శక్తిగా రూపొందించడంపై దృష్టి పెట్టారని ఈ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశం చైనాను ప్రధాన శత్రువుగా చూస్తూనే, పాకిస్తాన్ ను తక్షణ భద్రతా సమస్యగా పరిగణిస్తున్నదని, ముఖ్యంగా మేలో భారత్- పాక్ సైన్యాలు పరస్పరం దాడులకు దిగిన తర్వాత ఈ భావన పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు.
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గాం లో టెర్రరిస్ట్ లదాడి, మే 7న భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్, పాక్ లోని టెర్రరిస్ట్ మౌలిక సదుపాయాలపై దాడులు, మే 7 నుంచి మే 10 వరకూ రెండు సైన్యాలు డ్రోన్లు, క్షిపణులు, మందుగుండు సామగ్రితో దాడులకు పాల్పడడం, మే 10న కాల్పుల విరమణకు అంగీకరించిన అంశాలను అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదికలో సమగ్రంగా వివరించింది. చైనా ప్రభావాన్నిదీటుగా ఎదుర్కొనేందుకు, ప్రపంచ నాయకత్వ పాత్రను మరింత పెంచుకునేందుకు భారతదేశం ముఖ్యంగా హిందూ మహా సముద్ర ప్రాంతంలో ద్వైపాక్షిక భాగస్వామ్యాలకు అత్యతం
ప్రాధాన్యం ఇస్తోందని ఆ నివేదిక లో పేర్కొన్నారు. భారతదేశం- చైనా సరిహద్దు వివాదాన్ని, 2020 లో రెండు దేశాల మధ్య ఘర్షణ ను కూడా నివేదిక ప్రస్తావించింది,. ఆ తర్వాత కూడా సరిహద్దు వివాదం పరిష్కారం కాలేదని పేర్కొన్నది. భారతదేశం సైనిక ఆధునీకరణకు, మేడ్ ఇన్ ఇండియా ప్రోత్సాహంతో దేశీయ రక్షణ పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యం, అణుసామర్థ్యం పెంచుకోవడం, అగ్ని -1, ఎంఆర్ బిఎం, అగ్ని -5 పరీక్షల విజయవంతం అన్ని అంశాలనూ, రష్యా – భారత సంబంధాలను కూడా అమెరికా ఏజెన్సీ నివేదికలో ప్రస్తావించింది.
పాకిస్తాన్ పై నివేదికలో ప్రత్యేక ప్రస్తావన
పాకిస్తాన్ పై నివేదికలో ప్రత్యేకంగా పేర్కొంది. పాక్ సైన్యం ప్రాధాన్యతలు, ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దు ఘర్షణలు, తాహ్రిక్ – ఇ – తాలిబన్ పాకిస్తాన్, బెలూచిస్తాన్ జాతీయవాద ఉగ్రవాద దాడులు, టెర్రరిస్ట్ ల అణచివేతకు చేపట్టిన ప్రయత్నం, అణ్వాయుధ ఆధునీకరణ వంటి పలు విషయాలు అమెరికా నివేదిక పేర్కొంది 2024లో పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ లు 2,500 మంది ప్రజలను చంపారని అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ పేర్కొంది. పాక్ భారతదేశాన్ని తన ఉనికికి ముప్పుగా భావిస్తుంది. భారత్ కు దీటుగా అణ్వాయుధాల అభివృద్ధితో సహా సైనిక ఆధునీకరణకు ప్రయత్నాలు కొనసాగిస్తోందని నివేదికలో వివరించారు
. పాక్ అణ్వాయుధాల ఆధునీకరణతో పాటు, అణు కమాండ్, సామూహిక విధ్వంసక ఆయుధాలను విదేశాల నుంచీ మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేస్తున్నదని నివేదిక పేర్కొంది.
పాకిస్తాన్ – చైనా సైనిక అనుబంధం
పాకిస్తాన్ చైనా నుంచి ఆర్థిక, సైనిక సహాయం పొందుతున్నది. దాని దళాలు చైనా సైన్యంతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయని వివరించింది. పాక్ సేకరిస్తున్న సామూహిక విధ్వంసక ఆయుధాల సేకరణ కార్యక్రమానికి చైనా మద్దతు ఇవ్వడంతో పాటు, విదేశీ ఆయుధాలు, సాంకేతికత ను కూడా చైనాలోని సరఫరాదారుల నుంచి అంది ఉండవచ్చు. ఆ ఆయుధాలు హాంకాంగ్, సింగపూర్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ద్వారా రవాణా చేయబడతాయని కూడా నివేదిక లో వివరించారు. చైనా- పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే చైనా కార్మికులపై టెర్రరిస్ట్ దాడులు, జరిగాయి, 2024లో పాకిస్తాన్ లో ఏడుగులు చైనా జాతీయులు మరణించారని నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ – ఇరాన్ సంబంధాలను ప్రస్తావించారు. అలాగే 2024 సెప్టెంబర్ లో తాలిబన్, పాక్ సరిహద్దు దళాల మధ్య సరిహద్దు పోస్ట్ ల మధ్య జరిగిన ఘర్షణ, 8 మంది తాలిబన్ల మరణం, ఆఫ్గానిస్తాన్ పాక్ మధ్య 2025 మార్చిలో జరిగిన వైమానిక, ఫిరంగి దాడులను కూడా అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదికలో పేర్కొంది.