న్యూఢిల్లీ: డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తృటిలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్ అవుతుండగా అమెరికన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 MAX 8 విమానంలో మంటలు చెలరేగాయి. గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై.. ప్రయాణికులందరినీ ఎమర్జెన్సీ విండో నుంచి కిందకు దింపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితోపాటు 173 మంది ప్రయాణికులు ఉన్నారు.
శనివారం మధ్యాహ్నం విమానం.. డెన్వర్ ఎయిర్ పోర్టు నుంచి మయామికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. అందరూ ప్రాణాలతో బయట పడగా.. ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అతడిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రన్వే 34L నుండి విమానం టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు ఈ సంఘటన జరిగింది. ప్రధాన ల్యాండింగ్ గేర్లోని టైర్ వేడెక్కడం లేదా పనిచేయకపోవడం వల్ల విమానంలో మంటలు చెలరేగాయి.