న్యూఢిల్లీ: వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌లో కొనసాగిన అగ్రశ్రేణి లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గురువారం ఆటకు వీడ్కోలు పలికాడు. అమిత్ మిశ్రా మూడు ఫార్మాట్‌లలోనూ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. కెరీర్‌లో మొత్తం 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టి20 మ్యాచ్‌లు ఉన్నాయి.
ఈ క్రమంలో మొత్తం 156 వికెట్లను పడగొట్టాడు. ఇక ఐపిఎల్‌లో వివిధ జట్ల తరఫున ఆడాడు. ఐపిఎల్‌లో 162 మ్యాచ్‌లు ఆడిన మిశ్రా 174 వికెట్లను పడగొట్టాడు. మరోవైపు ఐపిఎల్‌లో మూడు హ్యాట్రిక్‌లు సాధించిన ఏకైక క్రికెటర్‌గా మిశ్రా రికార్డు సృష్టించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన అమిత్ మిశ్రా భారత్ తరఫున తన చివరి మ్యాచ్‌ను 2017లో ఆడాడు. యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో తాను రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నట్టు మిశ్రా పేర్కొన్నాడు.