ఢిల్లీ: పహల్గాం దాడి అమానుష ఘటన అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను తీవ్రవాదులు చంపడం దారుణమని మండిపడ్డారు. లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగించారు. అమాయక పౌరులపై దాడులు చేస్తే మా ప్రతి స్పందన గట్టిగా ఉంటుందని హెచ్చరించారు. విపక్ష ఎంపిల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు.
పహల్గాం దాడి బాధితులను కలిసి వారి బాధలు తెలుసుకున్నామని, పహల్గాం దాడి ఘటనను వెంటనే ఎన్‌ఐఎకు అప్పగించామని వివరించారు. ‘శాస్త్రీయ దర్యాప్తు జరపడంలో ఎన్‌ఐఎకు మంచి పేరు ఉంది, ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు ఆధారాలున్నాయా? అని, కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించారు, మీరు పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారా?’ అని అమిత్ షా ఎద్దేవా చేశారు. పాక్ నుంచి వచ్చారనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఉగ్రవాదుల నుంచి పాక్‌లో తయారైన పత్రాలు, చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నామని, కేంద్ర హోంశాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తగదని అమిత్ షా చురకలంటించారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు గమనించి కాంగ్రెస్ నేతలు మాట్లాడాలని సూచించారు.
ఆపరేషన్ సింధూర్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరంగా చెప్పారని, పహల్గాం తీవ్రవాదుల దాడిలో 26 మంది మృతి చెందారని, మృతుల్లో నేపాల్ వ్యక్తి కూడా ఉన్నారని తెలియజేశారు. పహల్గాం దాడి కేవలం పర్యాటకులపై కాదు అని, దేశంపై దాడి పరిగణించాలని, పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపేశామని, ఆనాడు 140 కోట్ల మంది ప్రజల గుండెచప్పుడును ప్రధాని మోడీ వివరించారని అమిత్ షా గుర్తు చేశారు. పాక్‌పై దాడులు చేసేందుకు భద్రతాబలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని, మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టామని, 9న ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేశామని, మన భద్రతా దళాల దాడుల్లో ఒక్క పాక్ పౌరుడు కూడా మరణించలేదన్నారు. పాక్‌లో వందల కిలో మీటర్ల లోపలికి వెళ్లి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. భద్రతా దళాల దాడుల్లో పలువురు ఉగ్రవాద నేతలు కూడా హతమయ్యారని వివరించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పామని, పాకిస్థాన్ దాడుల్లో ఇక్కడి గురుద్వారా, దేవాలయం ధ్వంసమయ్యాయని హోంశాఖ మంత్రి తెలియజేశారు.