Sunday, September 14, 2025

హిందీ.. సైన్స్, న్యాయ, పోలీసు మాధ్యమం కావాలి: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: హిందీకి, దేశంలోని ఇతర భారతీయ భాషలకు ఎటువంటి ఘర్షణ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే ఆంగ్ల మాధ్యమ ప్రభావం తగ్గించాలంటే హిందీకి మనం అనుసంధాన భాషగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అన్నారు. హిందీ భాషకు ఉన్న సౌలభ్యత, సరళీకృత లక్షణాలతో హిందీని శాస్త్రం, న్యాయ వ్యవస్థ, పోలీసు విభాగాల వాడక ప్రామాణిక భాషగా తీర్చిదిద్దుకోవాల్సి ఉందని పిలుపు నిచ్చారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో హిందీ దివస్ సందర్భంగా హోం మంత్రి 5వ అఖిల భారతీయ రాజ్‌భాషా సమ్మేళన్‌ను ఉద్ధేశించి మాట్లాడారు. భారతీయ భాషల మధ్య వైరం లేదని, హిందీకి ఇతర భాషలకు పొసగదనే వాదన సరికాదని చెప్పారు. మాతృభాష ప్రాధాన్యత ఉండనే ఉంటుందన్నారు.

అయితే హిందీని పరిపాలనా సౌలభ్యత కోసం కేవలం మాట్లాడే భాషగానే కాకుండా సైన్స్, జుడిషయరీ, టెక్నాలజీ, పోలీసు విభాగాల వ్యవహారిక భాషగా మల్చుకుంటే ఆయా విభాగాలలో నిర్వహణ సౌలభ్యత ఏర్పడుతుందన్నారు. హిందీని మాధ్యమ భాషగా తీర్చిదిద్దుకుంటే అనుసంధానత ఇనుమడిస్తుందన్నారు. ఏ ఇతర భాషల ప్రభావం ఎంతగా ఉన్నా భారతీయులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ తమ భాషలను పరిరక్షించుకోవాలి. అవి కాలం చెల్లకుండా శాశ్వతం అయ్యి తీరాలి. ఇందుకు తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. వారు పిల్లలతో వారివారి మాతృభాషలలోనే మాట్లాడితే సహజంగానే భారతీయ భాషలకు ఉనికి సార్థకత దక్కుతుందని పిలుపు నిచ్చారు. అయితే హిందీని కీలక రంగాల మాధ్యమ ప్రామాణిక భాషగా మల్చుకుంటే మంచిదని సూచించారు. హిందీకి, ఇతర భాషలకు మధ్య ఘర్షణ లేదా వివాదాలు ఉన్నాయనే వాదన కొందరి కల్పితం అన్నారు. దయానంద సరస్వతి, మహాత్మా గాంధీ, కెఎం మున్షీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి జ్ఞానులు ఇతరులు హిందీని ప్రామాణిక భాషగా ఆమోదించారు.

హిందీని ప్రోత్సహించారు. ఇక ఇక్కడ గుజరాత్‌లో గుజరాతీ, హిందీ ఒక్కటిగా విలసిల్లుతున్నాయి. రెండు భాషల అభివృద్ధికి ఈ ప్రాంతం గణనీయ ఉదాహరణగా నిలిచిందన్నారు. సంస్కతం మనకు విజ్ఞాన గంగగా నిలిచింది. కాగా హిందీ విజ్ఞానాన్ని ఇంటింటికి చేరేలా చేసింది. ప్రతి భాషా మాధ్యమం ద్వారానే శాస్త్ర విజ్ఞానం ఇతరత్రా విలువైన సమాచారం అందరికి చెందుతుందన్నారు. స్థానిక భాషల ప్రాధాన్యత ఎవరూ కాదనలేనిదని చెప్పిన అమిత్ షా అయితే హిందీని పరిపాలనా మాధ్యమ భాషగా సైన్స్, న్యాయవ్యవస్థ, శాంతిభద్రతల సంబంధిత పోలీసు విభాగాల్లో ప్రమాణికం చేసుకుంటే జాతీయ స్థాయిలో భాషాపరమైన అనుసంధానత ఏర్పడుతుంది. ఆయా రంగాల్లో మార్పులు చేర్పులు దేశవ్యాప్తంగా విదితం అయ్యేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. మాతృభాష వాడకం అత్యంత కీలకం అని పరిశోధనల్లో తేటతెల్లం అయింది. ప్రత్యేకించి మనస్తత్వవేత్తలు, విద్యావేత్తలు పిల్లలు తమ మాతృభాషలోనే ఆలోచిస్తుంటారని తెలిపారు.

ఎప్పుడైతే వేరే భాషను మాతృభాష కాకుండా రుద్దడం జరిగితే, పిల్లల మేధోశక్తిపై ప్రభావం పడుతుంది. పిల్లల ఆలోచనాశక్తిలో దాదాపు 25 నుంచి 30 శాతం వరకూ ఇతర భాషలలోని అంశాలను మాతృభాషల్లోకి మలుచుకునేందుకే వెచ్చించాల్సి వస్తుందని అమిత్ షా చెప్పారు, ఇది సైకాలజిస్టులు, పలువురు ప్రొఫెసర్లు చెప్పిన మాట అని తెలిపారు. మన పిల్లల భవిష్యత్తు గురించి వారి చదువు, విజ్ఞానం గురించి ఆలోచించుకోవడం ప్రధాన విషయం అని అమిత్ షా స్పష్టం చేశారు. హిందీ ఇతర ప్రాంతీయ భాషలను కూడా కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు. హోం మంత్రిత్వశాఖ ద్వారా ప్రత్యేకంగా భారతీయ భాషా అనుభాగ్ (భారతీయ భాషల విభాగం) ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కూడా తరచూ స్థానిక భాషల బలోపేతానికి పలు విధాలైన సాంకేతిక పద్ధతుల వాడకానికి ముందుకు వస్తున్నారని తెలిపారు.

Also Read: నాపై విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధమే : మోడీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News