పహల్గాం పాత్రధారులను,
కుట్రదారులను వదిలిపెట్టేది
లేదు 26మందిని చంపడం
ద్వారా గెలిచామనుకోకండి
అంతకు మించిన శిక్షకు
గురికాక తప్పదు ఉగ్రవాదాన్ని
నిర్మూలించాలన్నదే మా
సంకల్పం : హోంమంత్రి
అమిత్ షా తీవ్ర హెచ్చరికలు
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ లోని పహల్గంలో 26 మంది టూరిస్ట్ లను హతమార్చిన టెర్రరిస్ట్ లు ఎక్కడ దాగినా, వెదికి వేటాడతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉగ్రవాద దాడి పై మొదటి సారి బహిరంగంగా ప్రసంగిస్తూ ఈ హెచ్చరిక చేశారు. టెర్రరిస్ట్ లకు ఇప్పటివరకూ తగిన శాస్తి జరగలేదని అన్నారు. పహల్గాం దాడిలో పాల్గొన్న టెర్రరిస్ట్ లనే కాదు, ఈ దాడికి కుట్రపన్నినివారినీ, మద్దతు ఇచ్చిన వారినీ ఒకొక్కరినీ కచ్చితంగా వెదికి వేటాడి తీరతాం ఎవరినీ వదిలిపెట్టం అని అమిత్ షా తీవ్ర ఆగ్రహంతో అన్నారు. 26 మందిని చంపడం ద్వారా మీరు గెలిచామని అనుకోకండి, ప్రతి ఒక్క రూ అంతకంటే తీవ్ర శిక్షకు గురికాక తప్పదు అని హోంమంత్రి అన్నారు.
అసోం బోడో కమ్యునిటీ నాయకుడు ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహ ఆవిష్కరణ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఢిల్లీలో ఓ రహదారికి బ్రహ్మ పేరు పెట్టారు. ఇది నరేంద్రమోదీ సర్కార్.. ఎవరినీ వదిలిపెట్టం. ఈ దేశంలో టెర్రరిజాన్నిపూర్తిగా నిర్మూలించాలన్నదే మా సంకల్పం.. దానిని సాధించి తీరతాం అని అమిత్ షా తీవ్ర స్వరంతో అన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు. హోం మంత్రి అమిత్ షా తోపాటు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇతర అధికారులు ఏప్రిల్ 22న టెర్రరిస్ట్ దాడిలో మరణించిన వారి ఆత్మశాంతికోసం ఒక నిముషం పాటు మౌనం పాటించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ప్రమోద్ బోరో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.