అమరావతి: దాగుడు మూతలు ఆడే క్రమంలో బాలుడు బియ్యం డబ్బాలో దాక్కోవడంతో ఊపరాడక అతడు మృతి చెందాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా కంచికర్లలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అరుంధతీ కాలనీలో పవన్, సరస్వతి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు వినయ్, వికాస్(07)లు ఉన్నారు. చిన్న కుమారుడు వినయ్‌కు ఆధార్ కార్డులో వివరాలు తప్పుగా పడడంతో సరి చేసుకోవడానికి ఖమ్మం జిల్లాలోని మండుమల్లులోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లిన బాబును సొంతూరుకు తీసుకొచ్చారు.
వికాస్ ఇరుగుపొరుగు పిల్లలతో కలిసి దాగుడు మూతలు ఆడుకుంటున్నాడు. కొంచెం సేపటి తరువాత బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు వెతికారు. వినయ్ ఆచూకీ లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో డాబా పైకి వెళ్లి చూడగా బియ్యం డబ్బా తల్లి కాలికి తగిలింది. అనుమానం వచ్చి బియ్యం డబ్బా మూత తీయగా బాలుడు మృతి చెంది కనిపించాడు. వినయ్ డబ్బాలో దాక్కునే క్రమంలో మూత పడిపోయిందని, ఊపిరాడక మృతి చెంది ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.