బ్రసెల్స్ : పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలను రుణాల ద్వారా తీసుకుని ఎగ్గొట్టి బెల్జియంలో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని అక్కడి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గతంలో తన అరెస్టుని బెల్జియం కోర్టులో సవాల్ చేయగా, న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా మరోసారి కోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానంలో అతడికి మళ్లీ ఎదురుదెబ్బ తగిలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న అతను కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో అతడు తన నివాసంలో ఉంటూ అధికారుల నిఘాలో ఉండడానికి అనుమతించాలని అభ్యర్థించగా, ఆగస్టు 26న విచారణ చేపట్టిన ధర్మాసనం ఛోక్సీ బెయిల్‌ను తిరస్కరించిందని సంబంధిత అధికారి పేర్కొన్నారు. అతడికి బెయిల్ మంజూరు చేస్తే సులభంగా ఇతర దేశాలకు పారిపోయే అవకాశం ఉందని భారత్ బెల్జియం కోర్టులో పేర్కొన్నట్టు కూడా తెలిపారు. చోక్సీని తనకు అప్పగించాలంటూ భారత దర్యాప్తు సంస్థ సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన అభ్యర్థనతో ఛోక్సీను ఏప్రిల్ 11న అంటిగ్వా పోలీసులు అరెస్టు చేశారు. దాంతో నాలుగు నెలలకు పైగా అక్కడి జైలు లోనే ఉన్నారు. ఛోక్సీ, అతని కంపెనీలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని, ఆధారాలను అందించడానికి సీబీఐ బృందం కిందటి నెలలో ఆంటిగ్వాకు వెళ్లింది.
దీని వల్ల నేరస్థుడిని స్వదేశానికి అప్పగించే చర్యల్లో భాగంగా బెల్జియన్ ప్రాసిక్యూటర్లకు అండగా ఓ యూరోపియన్ లా సంస్థను నియమించుకోవడానికి వెళ్లినట్టు తెలిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న దాదాపు రూ. 13 వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టిన ఛోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ (కేసులో మరో ప్రధాన నిందితుడు) దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వాబ్రార్బుడాకు వెళ్లగా, నీరవ్‌మోదీ లండన్‌లో ఆశ్రయం పొందాడు. ఛోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని , గతనెల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆ దేశస్థురాలైన తన సతీమణి ప్రీతి ఛోక్సీ సాయంతో 2023 నవంబరులో అతడు ఎఫ్ రెసిడెన్సీ కార్డ్ పొందాడు. అందుకు అతడు తప్పుడు పత్రాలు సమర్పించినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అతడికి భారత్‌లో, అంటిగ్వాలో పౌరసత్వాలు ఉన్న బిషయాన్ని దాచి పెట్టాడు. ఈ కారణాల తోనే అక్కడి అధికారులు ఛోక్సీని అరెస్టు చేశారు. మరోవైపు అతడిని భారత్‌కు రప్పించేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.