మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌కి భారత బౌలర్లు ఆర్ష్‌దీప్, ఆకాశ్‌దీప్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రత్యమ్నాయంగా యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌ని (Anshul Kamboj) జట్టులోకి తీసుకున్నారు. అయితే ఆరంగేట్ర మ్యాచ్‌లోనే అన్షుల్ కాస్త నిరాశ పరిచాడు. తొలి ఓవర్‌లోనే 12 పరుగులు సమర్పించుకున్నాడు. మొదటి స్పెల్‌లో అంతగా ప్రభావం చూపలేకపోయాడు. కానీ, రెండో స్పెల్‌లో భారత్‌ను తిప్పలు పెడుతున్న బెన్ డకెట్(94)ని ఔట్ చేసి జట్టుకు ఊరట కల్పించాడు. అయితే మ్యాచ్ అనంతరం అన్షుల్ మాట్లాడుతూ.. మూడో రోజు ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేస్తానని అన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్ తీయడం సంతోషంగా ఉందని అన్షుల్ (Anshul Kamboj) పేర్కొన్నాడు. తన అనుకున్న విధంగానే బౌలింగ్ చేశానని.. కాని కొన్నిసార్లు బంతి సరైన ప్లేస్‌లో పడలేదని అన్నాడు. తన బౌలింగ్‌తో ఇప్పటికైతే సంతృప్తికరంగా లేనని.. మూడో రోజు ఇంకా మెరుగ్గా బౌలింగ్ చేసి.. ఇంగ్లండ్ ప్లేయర్లను వీలైనంత త్వరగా ఆలౌట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ‘‘ఇంగ్లండ్ ప్లేయర్లు ఎక్కువగా అటాకింగ్ గేమ్ ఆడుతారు. అందుకే బౌండరీలు ఆపేందుకు ప్రయత్నిస్తాం. బౌండరీలు రాకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌లో వికెట్లు ఇచ్చేస్తారు. అదే మా ప్లాన్’’ అని వివరించాడు.