తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి పిలుపునిచ్చారు
మన తెలంగాణ/మోత్కూర్: కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే ఉప సంహరించుకోవాలని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలో ని ఎన్డిఎ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పోరేట్ అనుకూల, మతోన్మాద చర్యలకు పాల్పడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అన్నారు. ఆదివారం మోత్కూర్ పట్టణ కేంద్రంలో కూలీలతో ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కొడ్లను తీసుకొచ్చిందన్నారు. కార్మిక వర్గం అనేక పోరాటాల ఫలితంగా లేబర్ కోడ్ లు అమలుకు ఆలస్యం అయినా ప్రస్తుతం వాటిని అమలు చేసి కార్మిక వర్గం హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని బొల్లు విమర్శించారు.
2025-26 బడ్జెట్ లో కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందన్నారు. సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టిందన్నారు. సామాన్యులపై బారాలు మోపి, కార్పొరేట్ గుత్త సంస్థలకు, పెట్టుబడుదారులకు ఐదు వేల కోట్లు రాయితీ ప్రకటించిందన్నారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలు పట్టించుకోలేదన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కార్మిక వర్గం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.
అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రోజురోజుకు నిర్వీర్యం చేస్తుందని బొల్లు అన్నారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాచకొండ రాములమ్మ, మెతుకు అంజయ్య, తీగల సావిత్రమ్మ, గుండు లక్ష్మి, బొల్లు రంగమ్మ, జి నవనీత, వల్లాల అనసూయ, శోభ తదితరులు పాల్గొన్నారు