హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. అక్రమ మద్యం నగదు డంప్‌ను ఎపి సిట్ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో నగదును ఎపి సిట్ అధికారులు పట్టుకున్నారు. సులోచన ఫార్మస్ గెస్ట్‌హౌజ్‌లో 12 అట్టపెట్టెల్లో దాచిన రూ.11 కోట్ల నగదును పట్టుకున్నారు. రాజ్ కసిరెడ్డి సూచనల మేరకు నగదును 12 బాక్సుల్లో ఉంచినట్టు గుర్తించారు. నిందితుడు వరుణ్ పురుషోత్తమ్ వాంగ్మూలం ఆధారంగా ఎపి సిట్ సోదాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో ఎ40గా వరుణ్ పురుషోత్తమ్ ఉన్నాడు. నగదు సీజ్ ఘటనలో చాణక్య, వినయ్ ప్రాతపైనా విచారణ చేస్తున్నారు.
రాజ్ కెసి రెడ్డి, చాణక్య ఆదేశాల మేరకు జూన్ 2024లో వినయ్ సాయంతో వరుణ్ రూ.11 కోట్ల నగదును 12 అట్ట పెట్టెలను ఆఫీస్ ఫైళ్ల పేరుతో దాచినట్టు అధికారులు గుర్తించారు. వరుణ్ పురుషోత్తమ్ నేరాన్ని అంగీకరించి నిజాలు బయటపెట్టడంతో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ లో రూ.3500 కోట్ల పైగా అక్రమాలు జరిగినట్టు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.