రాష్ట్రంలో కొత్తగా జీపిఓలుగా నియమితులైన 5 వేల మంది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లకు 5వ తేదీన సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. జీపిఓలకు నియామక పత్రాలను మాదాపూర్‌లోని హైటెక్స్‌లో సాయంత్రం 4 గంటలకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై మంగళవారం సంబంధిత కార్యదర్శులు ఉన్నతాధికారులతో సిఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి ఎంపికైన విఆర్‌ఓలు
మధ్యాహ్నం 2 గంటల లోపు హైటెక్స్ చేరుకునేలా ప్రత్యేకంగా ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి దాదాపు 120కి పైగా ఆర్టీసి బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసి ఎండిని ఆదేశించారు. ఈ బస్సుల పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణను చేపట్టాలని సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో రోడ్డు భవనాలు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఫైర్ సర్వీస్ డిజి నాగిరెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.