ముంబై: ప్రతిష్ఠాత్మకమైన ఆసియాకప్ టి20 టోర్నమెంట్ కోసం టీమిండియాలో ఎవరికి చోటు దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 9 నుంచి యుఎఇ వేదికగా ఆసియాకప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భారత్‌తో సహా పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆసియాకప్ కోసం త్వరలోనే టీమిండియాను ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌దీప్ తదితరులు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నారు.
వీరితో పాటు మరో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో చోటు దక్కించుకోవాలని తహతహలాడుతున్నాడు. కానీ జట్టులో సంపాదించడం వీరికి అనుకున్నంత తేలికకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా కాలంగా టి20లలో టీమిండియా అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు రింకు సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తదితరులు టి20 టీమ్‌లో తమ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. వీరిని కాదని ఇతర ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించే పరిస్థితి కనిపించడం లేదు.
కానీ శుభ్‌మన్ గిల్, యశస్వి, శ్రేయస్ వంటి స్టార్ ఆటగాళ్లను టీమిండియాకు దూరంగా ఉంచేందుకు సెలెక్టర్లు సాహసం చేస్తారా అంటే కాదనే సమాధానం లభిస్తోంది. ఈ ముగ్గురు కూడా భారత క్రికెట్‌లోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. వీరిని జట్టుకు దూరంగా ఉంచే పరిస్థితి కూడా లేదు. వీరిని జట్టులోకి తీసుకుంటే ఎవరిని దూరంగా ఉంచాలనేది సెలెక్టర్లకు అతి పెద్ద సవాల్‌గా తయారైంది. కొంత కాలంగా టి20లలో భారత్ అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తోంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్, హార్దిక్ తదితరులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. జట్టు విజయాల్లో తమవంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు. వీరిని తప్పించి ఇతర ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించడం అనుకున్నంత తేలికేం కాదు. ఇలాంటి స్థితిలో ఆసియాకప్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.