Thursday, September 11, 2025

ఫేవరెట్‌గా బంగ్లాదేశ్.. నేడు హాంకాంగ్‌తో పోరు

- Advertisement -
- Advertisement -

అబుదాబి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ గురువారం తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. గ్రూప్‌బిలో భాగంగా అబుదాబిలో జరిగే ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీకి శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో బంగ్లా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో ఓడిన హాంకాంగ్‌కు ఈ పోరు సవాల్‌గా మారింది. బలమైన బంగ్లాను ఓడించడం హాంకాంగ్‌కు చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లా సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ లిటన్ దాస్ జట్టును ముందుండి నడిపించేందుకు సిద్ధహయ్యాడు.

లిటన్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. పర్వేజ్ హుస్సేన్, తౌహిద్ హృదయ్, సైఫ్ హసన్, మెహదీ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రహ్‌మాన్, షరిఫుల్ ఇస్లాం, తంజీమ్ హసన్ సాకిబ్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. హాంకాంగ్‌తో పోల్చితే బంగ్లా అన్ని విభాగాల్లోనూ చాలా మెరుగ్గా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మరోవైపు హాంకాంగ్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం జట్టును వేధించింది. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. జీషాన్ అలీ, కెప్టెన్ యాసిమ్ ముర్తుజా, అంశుమన్ రాథ్, బాబర్ హయాత్, ఎజాజ్ ఖాన్, ఎహ్‌సాన్ ఖాన్, నిజాకత్ ఖాన్ తదితరులతో హాంకాంగ్ బాగానే కనిపిస్తోంది. అయితే అనుభవలేమీ జట్టుకు ప్రధాన సమస్యగా తయారైంది. ఇలాంటి స్థితిలో బంగ్లాతో పోరు హాంకాంగ్‌కు అతి పెద్ద పరీక్షగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News