దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఇరు జట్లు ఇప్పటికే చెరో విజయం సాధించి జోరుమీదున్నాయి. యుఎఇతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా రికార్డు విజయాన్ని అందుకుంది. ఒమన్‌తో జరిగిన పోరులో పాకిస్థాన్ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో రెండు జట్లు ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. పాక్‌తో పోల్చితే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉందని చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. యుఎఇతో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ చిరస్మరణీయ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె, అక్షర్, హార్దిక్ తదితరులతో భారత బౌలింగ్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. స్పిన్‌కు అనుకూలించే దుబాయి పిచ్‌పై టీమిండియా బౌలర్లు చెలరేగి పోవడం ఖాయమనే చెప్పాలి.
ఇక బ్యాటింగ్‌లోనూ భారత్ బలంగా ఉంది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, హార్దిక్, అక్షర్ వంటి మ్యాచ్ విన్నర్ బ్యాటర్లు జట్టులో ఉన్నారు. కిందటి మ్యాచ్‌లో ఓపెనర్లు గిల్, అభిషేక్‌లు దూకుడైన బ్యాటింగ్‌తో అలరించారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సూర్యకుమార్, సంజు శాంసన్, తిలక్ వర్మలు కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. ఎటువంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా వీరికి ఉందని చెప్పొచ్చు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని జట్టుకు మెరుగైన స్కోరును అందించాలని వీరు తహతహలాడుతున్నారు. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కాగా, దాయాది పాక్‌తో జరిగే మ్యాచ్‌లో అందరి కళ్లు కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ గిల్‌పైనే నిలిచాయి. వీరు ఎలా బ్యాటింగ్ చేస్తారనే దానిపైనే జట్టు భారీ స్కోరు ఆధారపడి ఉంది.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు పాకిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. భారత్‌తో పోరు అంటే పాక్ ఆటగాళ్లు సర్వం ఒడ్డి పోరాడడం అనవాయితీగా మారింది. సీనియర్లు బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లు లేకున్నా పాకిస్థాన్ బలంగానే ఉంది. ఓపెనర్ ఫర్హాన్, వికెట్ కీపర్ మహ్మద్ హారిస్, ఓపెనర్ సైమ్ అయుబ్, కెప్టెన్ సల్మాన్ ఆఘా, ఫకర్ జమాన్, హసన్ నవాజ్ తదితరులతో పాకిస్థాన్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. అయితే ఒమన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అయుబ్, సల్మాన్‌లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బౌలింగ్‌లో పాక్ చాలా బలంగా ఉంది. ఆరంభ మ్యాచ్‌లో ఒమన్‌ను 67 పరుగులకే పరిమితం చేయడంలో పాక్ బౌలర్లు విజయం సాధించారు. సైమ్ అయుబ్, ఫహీం అశ్రఫ్, సూఫియాన్ ముఖిమ్ తదితరులు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత్‌తో జరిగే పోరులోనూ వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
Also Read: మా వేదనను అప్పుడే మర్చిపోయారా.. పహల్గాం బాధితురాలి ఆగ్రహం