దుబాయ్: భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆసియా కప్ 2025 షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు ఉండగా.. 18 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 15న అబుదాబిలోని జాయేద్ క్రికెట్ స్టేడియంలో యూఏఈ, ఒమన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ టైమింగ్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ మ్యాచ్ ముందు ప్రకటించినట్టుగానే రాత్రి 5.30కు ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆసియా కప్ 2025లోని 19 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకా రం సాయంత్రం 7:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే 18 మ్యాచ్‌ల ప్రారంభ సమయాన్ని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అరగంట ముందుగానే నిర్వహించేందుకు సన్నహాలు చేసినట్టు తెలిపింది. అంటే.. రాత్రి 8 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు) మ్యాచ్ వేళల్లో మార్పులు చేసినట్టు తెలిపారు. సెప్టెంబరులో యూఏఈలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రాడ్‌కాస్టర్ల అభ్యర్థన మేరకు మ్యాచ్ సమయాల్లో స్వల్ప మార్పులు చేసినట్లు వారు పేర్కొన్నారు. కాగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 9న ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరిగే మొదటి మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి.