Thursday, July 17, 2025

పేలిన ఐఇడి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో
మావోల దుశ్చర్య
పేలుడులో ఎఎస్‌పి మృతి
మరో ఇద్దరు పోలీసులకు
తీవ్ర గాయాలు హెలికాప్టర్‌లో
ఆసుపత్రికి క్షతగాత్రుల
తరలింపు ఆంధ్ర
సరిహద్దుల్లో హైఅలర్ట్

ఇటీవల కాలంలో అగ్ర నేతలతో సహా కిందిస్థాయి వారిని కోల్పోతూ ప్రతీకార చర్యతో రగిలిపోతున్న మావోయిస్టులు పోలీసు ఉన్నతాధికారిని బలి తీసుకున్నారు. ఇటీవల కాలంలో తీవ్రంగా నష్టపోయి అదునుకోసం ఎదురుచూస్తున్న మావోలు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, కుంటా ప్రాంతంలో సోమవారం ఉదయం ఐఇడి బాంబును అమర్చి పోలీసులను మట్టుపెట్టడానికి చేసిన పన్నాగంలో ఎఎస్‌పి ఆకాష్ రావు గిర్పుంజే మరణించారు. ఈ సంఘటనలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం చిక్వార్‌గూడ గనిలో పొక్లయిన్ యంత్రానికి నిప్పుపెట్టిన ఘటనపై దర్యాప్తు చేయడానికి కుంట డివిజన్ ఎఎస్‌పి ఆకాష్ రావు గిర్పుంజే, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భానుప్రతాప్ చంద్రకర్, ఇన్‌స్పెక్టర్ సోనాల్ గ్వాలాతో కలిసి కుంటా- ఎర్రబోరు రోడ్డులోని డోండ్రాకు వాహనంలో వెళ్తున్నారు ఈ సందర్భంగా మావోయిస్టులు అమర్చిన శక్తివంతమైన ఐఇడి బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కుంట ఎఎస్‌పి ఆకాష్ రావు గిర్పుంజే, డిఎస్‌పి, సిఐలు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను ప్రథమ చికిత్స అనంతరం హుటాహుటిన కుంట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఎఎస్‌పి ఆకాష్ రావు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉందని చెబుతున్నారు. 42 ఏళ్ల ఎఎస్‌పి ఆకాష్ రావు గిర్పుంజే రాయ్‌పూర్ జిల్లా నివాసి. 2013 బ్యాచ్ డైరెక్ట్ రిక్రూట్ డిఎస్‌పిగా పనిచేశారు. ఆయన 2024 నుండి కుంటాలో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. మన్పూర్-మోహ్లా, సుక్మా వంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో సేవలందించిన చత్తీస్‌గఢ్ పోలీసులలో అత్యంత ధైర్యవంతులైన యోధులలో ఆయన ఒకరు. ఆకాష్ రావు గిర్పుంజే భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం ఆయన స్వగ్రామం రాయ్‌పూర్‌కు తరలించారు. ఇదిలావుండగా, పోలీసులు, భద్రతా దళాలు మావోయిస్టులను టార్గెట్ చేస్తూ నిరంతరం పెద్ద ఎత్తున ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. తాజా సంఘటన తర్వాత ఆ ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆంధ్ర సరిహద్దులో బందోబస్తును పెంచారు. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News