అసోం గణపరిషత్ (ఎజిపి త్యాగాల నుంచి పుట్టింది. అసోంలో ఆరు సంవత్సరాలపాటు జరిగిన విదేశీయుల వ్యతిరేక ఆందోళన (1979 1985) స్వాతంత్య్రా నంతరం భారతదేశంలో జరిగిన అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య ఉద్యమాలలో ఒకటి. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు ఎలాంటి అడ్డుఆపూ లేకుండా వలస రావడాన్ని వ్యతిరేకిస్తూ కులాలకు, సమాజవర్గాలకు అతీతంగా ప్రజలను ఏకంచేసిన ఉద్యమం. 800 మందికి పైగా అమరవీరులు ప్రాణాలు అర్పించిన ఫలితంగా 1985లో అసోం ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం 1971 మార్చి 24ని విదేశీయులను గుర్తించి, బహిష్కరించడానికి పవిత్రమైన కటాఫ్ తేదీగా నిర్ణయించింది. కాగా, పశ్చిమ బెంగాల్, అసోంలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం 1971 తర్వాత స్థిరపడిన బెంగాలీ హిందూ వలసవాదులు, స్థిరపడిన వారికి పౌరసత్వం కల్పిస్తూ కొత్త ఆదేశాలు జారీ చేసింది. అస్సామీ ప్రజల గుర్తింపు, ప్రాంతీయ ఆకాంక్షలకు రాజకీయ సంరక్షకుడిగా ఉండేందుకు అసోం గణపరిషత్ ఈ పోరాట నేలనుంచి ఉద్భవించింది. కానీ, నేడు అతుల్ చంద్రబోరా నాయకత్వంలో, పార్టీ ఆ వారసత్వాన్నే విడిచి పెట్టింది.
త్యాగాల ఫలితంగా కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉండే బదులు, ఎజిపి, భారతీయ జనతా పార్టీ(బిజెపి) కి అవకాశవాద మిత్రుడిగా పని చేయడమే పనిగా పెట్టుకుంది. పౌరసత్వ చట్టంతో అధికార పార్టీ మతతత్వ, రాజ్యాంగ విరుద్ధమైన ప్రయోగాలకు కొమ్ముకాస్తోంది. వలసవచ్చిన విదేశీయులపై కేంద్రం జారీ చేసిన తాజా ఆదేశాలనుంచి అసోంకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ, సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు పార్టీ ఈ మధ్య ప్రకటించడం, సుదీర్ఘమైన ద్రోహాల పరంపరలో మరో కుట్ర. ఇది నిజమైన పోరాట ధోరణి కాకుండా, బిజెపితో అధికారంలో కొనసాగుతూ రాజకీయ అనుబంధం కొనసాగించేందుకు చేసిన ప్రయత్నంగా కన్పిస్తోంది. 2024 డిసెంబర్ 31న లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించిన అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్సీలకు చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు, వీసాలు లేకుండా కూడా రక్షణ కల్పించేందుకు ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం 2025 కింద కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరో మాటలో చెప్పాలంటే, 2014 డిసెంబర్ 31 గా నిర్ణయించిన పౌరసత్వ (సవరణ) చట్టం (సిసిఎ) అమలు కటాఫ్ తేదీని మరో దశాబ్దం ముందుకు తీసుకువెళుతుంది. అసోం విషయానికి వస్తే ఇది అసోం ఒప్పందం స్ఫూర్తిపై ప్రత్యక్ష దాడి. ఈ ఒప్పందం విదేశీయులను గుర్తించడంలో ఎప్పుడూ మతపరమైన తేడాలను చూపలేదు.
ఇది స్పష్టమైన కటాఫ్ తేదీని 1971 మార్చి 24గా నిర్ణయించింది. ఇప్పుడు అసోంలో కొత్తవర్గాల వలసదారులు ఉండేందుకు అనుమతించడం ద్వారా, కేంద్రం ఒప్పందాన్ని మాత్రమేకాక, దానికోసం పోరాడి, త్యాగాలు చేసిన వారి మనోభావాలను కూడా తుంగలోకి తొక్కింది. 2019లో తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, తర్వాత జారీ అయిన ఆదేశాలు భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ పునాదినే దెబ్బ తీస్తాయి. భారత రాజ్యాంగం, దాని ప్రవేశక ద్వారా గణతంత్ర రాజ్యాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. ఆర్టికల్ 14, 15 చట్టం ముందు అంతా సమానమే అన్న హామీ ఇచ్చాయి. మతపరమైన ప్రాతిపదికన వివక్షను నిషేధించాయి. ముస్లింలను మినహాయించి, ముస్లిమేతర వలసదారులకు ప్రత్యేక అధికారాలను అందించడం ద్వారా సిఎఎ ఈ సూత్రాలను సుస్పష్టంగా ఉల్లంఘించడమే. సిఎఎ మత ఆధారిత పౌరసత్వ చట్టం అని విమర్శకులు అభివర్ణించారు. ఇది భారతదేశ రాజ్యాంగ నీతికి విరుద్ధమైనది. భిన్నత్వంలో ఏకత్వంపై నిర్మించబడిన భారతదేశంలో పౌరసత్వం మతపరమైన గుర్తింపుద్వారా నిర్ణయించబడుతుందనే ఆలోచనే స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలు చేసిన త్యాగాలను, రాజ్యాంగ నిర్మాతల దార్శినికతను బలహీనపరుస్తున్నది. అసోం విషయానికి వస్తే, చట్టవిరుద్ధం మరింత స్పష్టంగా ఉంది. అసోం ఒప్పందం కేవలం రాజకీయ పరమైన ఒప్పందం కాదు. ఇది 1985 ఇమ్మిగ్రేషన్ చట్టం ద్వారా చట్టపరమైన చట్రంలో చేర్చబడిన ఒప్పందం.
సిఎఎ, దాని తర్వాత కొత్త ఆదేశాలను ముందుకు తీసుకురావడం ద్వారా, కేంద్రం ఒప్పందాన్ని అర్థరహితం చేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు శ్రీలంకలోని మైనారిటీ మహ సమూహం అయిన తమిళ హిందువులను కూడా వివక్షకు గురిచేసింది. శ్రీలంక తమిళుల కోసం కొత్త ఆదేశాల ప్రకారం 2015 జనవరి 9కి ముందు భారతదేశంలో నమోదు చేసుకుని, ఆశ్రయం పొందన వారికి బస, నిష్క్రమణ ప్రయోజనాల నుంచి మినహాయింపు ఉంది. అందువల్ల శ్రీలంక తమిళులకు కూడా కటాఫ్ తేదీ 2015 బదులు అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులతో పాటు తమిళ హిందువులకు 2024 డిసెంబర్ 31 కటాఫ్ తేదీగా ప్రకటించాలని కోరుతున్నారు. కొత్త పౌరసత్వం, కేంద్రం ఆదేశాల విషయంలో ఎజిపి పోషిస్తున్న పాత్ర ఏమిటి? ఒకప్పుడు అసోంను అక్రమ వలసల నుంచి కాపాడతామని ప్రతిజ్ఞ చేసిన ఎజిపి ఆ రక్షణ వ్యవస్థలను కూల్చివేసే శక్తులకు సహకరించే పాత్ర వహిస్తోంది.2019 లో పౌరసత్వ సవరణ చట్టం అమోదించబడినప్పుడు, అసోంలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అఖిల అసోం విద్యార్థి సంఘం వంటి విద్యార్థి సంఘాలు, పౌరసమాజ సంఘాలు ప్రభుత్వ ద్రోహాన్ని సవాల్ చేశాయి. అయినా, ఎజిపి, బిజెపితో తన సంబంధాలను తెంచుకునే బదులు, ఎన్‌డిఎ కూటమిలోనే కొనసాగాలని నిర్ణయించుకుంది. సుప్రీం కోర్టులో నామ్ కే వాస్తే.. ఓ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
క్షీణించిన ప్రాంతీయవాదం
అతుల్ బోరా నాయకత్వంలోని ఎజిపి అవకాశవాదంతో అసోం ప్రాంతీయవాద ఉద్యమస్ఫూర్తిని మరచిపోయినట్లు కన్పిస్తోంది. ఒకప్పుడు అస్సామీ జాతీయవాదానికి ప్రతిరూపంగా ఉన్న పార్టీ నేడు బిజెపి మత రాజకీయాల్లో ఓ జూనియర్ భాగస్వామి స్థాయికి పడిపోయింది. అసోం ఒప్పందంలో ముందంజలో ఉన్న అనిభవజ్ఞుడైన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఫ్రఫుల్ల కుమార్ మహంతను పక్కన పెట్టడం ఈ పతనానికి చిహ్నం. మహంత హయాంలో కొన్ని తప్పులు ఉన్నా, ఎజిపి దాని వ్యవస్థాపక స్ఫూర్తిని నిలుపుకుంది. బోరా నాయకత్వంలో అధికారం, స్వార్థ ప్రయోజనాలకోసం ఆ స్ఫూర్తిని వదిలిపెట్టారు. పదవుల కోసం సిద్ధాంతాలను త్యాగం చేయడంద్వారా, ఎజిపి నాయకత్వం అస్సాంలో ప్రాంతీయత అనే భావననే దెబ్బతీసింది. కేంద్రం కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా, ప్రజలకు రక్షణగా నిలబడడానికి బదులు, ఎజెపి బిజెపి కుట్రలకు ఓ సాధనంగా మారింది.
అసోంకు నిజమైన నష్టం
ఎజిపి ద్రోహం వల్ల కలిగిన పరిణామాలు కేవలం రాజకీయమైనవి కావు. అవి అసోం జనాభా ఆందోళనలు, సాంసృ్కతిక మనుగడ మూలాలకు వెళ్తాయి. అసోంలో వలసదారుల ప్రవాహం ఎప్పుడూ కీలక సమస్యే. అసోం ఒప్పందం తుది పరిష్కారాన్ని అందించేందుకు ఉద్దేశించబడింది. మొదట సిఎఎ ద్వారా, ఇప్పుడు 2015 కొత్త ఆదేశాల ద్వారా కేంద్రం పాత గాయాలను తిరిగి రేపినట్లయింది. ఎజిపి ధైర్యంగా వ్యవహరించి ఉంటే, బిజెపి కూటమి నుంచి వైదొలగి, ప్రాంతీయ భావాలను సమీకరించి, దృఢమైన వైఖరిని తీసుకుని ఉంటే కథ మరోలా ఉండేది. కానీ, బిజెపికి సహచరుడి పాత్ర వహించేందుకే పరిమితమైంది. అది తాను ప్రజల నమ్మకాన్ని కోల్పోవడమే కాక, అసోం ప్రయోజనాలను కాపాడేందుకు పాటుపడే ప్రాంతీయ పార్టీల అవకాశాలను కూడా దెబ్బతీసింది. సిఎఎ చట్టవిరుద్ధంగా, కొత్త ఆదేశాలకు వ్యతిరేకంగా పోరాడే బాధ్యత ఎజిపికి వదిలివేయలేం. అది నాయకత్వం వహించే నైతిక హక్కు కోల్పోయింది. ఆ బాధ్యతను అసోం విద్యార్థి సంఘాలు, పౌరసమాజం, ప్రజల ఆకాంక్షలను నిజంగా ప్రతిబింబించే కొత్త రాజకీయ శక్తులపై పడుతుంది.
సుప్రీం కోర్టు తన రాజ్యాంగపరమైన విధులను నిర్వర్తించాలి. పౌరసత్వ సవరణ చట్టం 2019 ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు చట్టంలోని స్పష్టమైన మత వివక్షను మాత్రమేకాకుండా అసోం ఒప్పందంతో దాని వైరుధ్యాన్ని కూడా పరిశీలించాలి. అన్ని మతాల పట్ల రాజ్యాంగం చూపిన సమానత్వాన్ని పునరుద్ధరించేందుకు, రాజకీయ ప్రయోజనాలు రిపబ్లిక్ లౌకిక వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించకుండా చూడగలదన్న ఆశ న్యాయవ్యవస్థపై ఉంది. అతుల్ చంద్రబోరా నాయకత్వంలో ఎజిపి అవకాశవాదం అసోంకు విషాదం. త్యాగాలు, పోరాటం ద్వారా పుట్టిన పార్టీ నేడు సిద్ధాంతాలను పక్కన పెట్టిన కేవలం స్వార్థ రాజకీయాలనే ఎంచుకుంది. బిజెపి విధానాలను కోర్టులో వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూనే, దానితో పొత్తు పెట్టుకుని, ఎజిపి అసోం ఒప్పందం స్ఫూర్తికి ద్రోహం చేసింది.
అస్సామీ ప్రాంతీయ వాదానికి పెద్ద విఘాతం కలిగించింది. సిఎఎ, కొత్త ఆదేశం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు. భారత లౌకిక గణతంత్రం అనే భావనకే ప్రమాదకరమైనవి. బిజెపి వారు పౌరసత్వం విషయంలో మతపరంగా ఆలోచిస్తున్నారు. శ్రీలంక తమిళ హిందువులు పట్ల వివక్ష చూపుతున్నారు. అస్సాం వాసులు కష్టపడి సాధించిన ఒప్పందాన్ని తుంగలో తొక్కుతున్నారు. ప్రాంతీయ పార్టీలను జాతీయ స్థాయి అధికార క్రీడలకు సాధనాల స్థాయికి దిగజారుస్తున్నారు. అసోం తన గుర్తింపును కాపాడుకోవాలంటే, భారతదేశం తన లౌకిక రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలంటే, ప్రజలు ఎజిపి జిమ్మిక్కులను అర్థం చేసుకోవాలి. ప్రాంతీయ వాదాన్ని పునర్నిర్మించాలి. అవకాశవాద రాజకీయాలను కాదు. అసోం చరిత్ర గౌరవం న్యాయం, లౌకికవాదం అనే సూత్రాలపై ఆధారపడి ఉంటుంది.
Also Read: ఉరుమురిమి హరీశ్‌పైనా?
గీతార్థ పాఠక్