మన తెలంగాణ/నిజామాబాద్ క్రైం ః నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఏటీఎంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న ఏటీఎం సెంటర్‌కు మారుతి వ్యాన్‌లో వచ్చిన దుండగులు.. గ్యాస్ కట్టర్‌తో మెషిన్‌కు కట్ చేశారు. అయితే అందులో నుంచి డబ్బులు తీసేందుకు ప్రయత్నిస్తుండగా అదే సమయంలో అటువైపుగా వచ్చిన పెట్రోలింగ్ టీమ్‌ను చూసి వ్యాన్‌లో పరారయ్యారు. ఈఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు మారుతి వ్యాన్‌లో వచ్చి నగరంలోని చంద్రశేఖర్ కాలనీలోని ఎస్‌బిఐ ఏటీఎంలోకి చొరబడ్డారు. గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను పగులగొట్టారు. ఏటీఎం యంత్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. నగదు దొంగిలించే ప్రయత్నం చేయగా.. అప్పుడే పెట్రోలింగ్ సిబ్బంది అటుగా రావడంతో పోలీసులను చూసి దుండగులు వ్యాన్లో పారిపోయారు. వెంటనే పెట్రోలింగ్ సిబ్బంది వారిని వెంబడిస్తూనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆయా ఠాణాల పోలీసులను అప్రమత్తం చేశారు.
మూడో టౌన్‌తో పాటు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది దుండగులను వెంబడించారు. వారు బాసర వైపు వ్యాన్లో పారిపోతుంటే.. వెనుక పోలీసులు సినిమా రేంజ్‌లో ఛేజింగ్ చేశారు. దీంతో నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాల్దా గ్రామం వద్ద దుండగులు వ్యాన్‌ను వదిలిపెట్టి చీకట్లో పరుగులు తీశారు. దీంతో పోలీసులు వాహనం స్వాధీనం చేసుకుని చూడగా అందులో గ్యాస్ కట్టర్ పరికరాలు పూర్తిగా ఉన్నాయి. ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టడానికి కావలసిన పరికరాలు వాహనంలో ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.