భారత మిస్సైల్ దాడి నుండి పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాలు డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. దీంతో ఆటగాళ్లను చార్టర్ విమానంలో దుబాయ్ కు తరలించింది. అయితే, పాక్ వైమానిక స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు జరగడానికి కొద్దిసేపటి ముందు ఆస్ట్రేలియా, అంతర్జాతీయ క్రికెటర్లు ఖాళీ చేసి వెళ్లడంతో ప్రమాదం తప్పిందని ఆస్ట్రేలియా నివేదికలు పేర్కొన్నాయి.
పాకిస్తాన్ సూపర్ లీగ్ వాయిదా పడిన తర్వాత పలువురు అంతర్జాతీయ, ఆస్ట్రేలియా క్రికెటర్లు రావల్పిండిలోని నూర్ ఖాన్ స్థావరం నుండి యూఏఈకి బయల్దేరారు. అయితే, పాకిస్తాన్ సైనిక స్థావరాలపై భారత్ ప్రతీకార కాల్పులు జరపడానికి కొన్ని గంటల ముందే ఆటగాళ్లు బయలుదేరినట్లు వార్తా కథనాలు బయటకు వచ్చాయి. ఆస్ట్రేలియా నివేదికల ప్రకారం.. ఆసీస్ క్రికెటర్లు సీన్ అబాట్, బెన్ ద్వార్షుయిస్, ఆష్టన్ టర్నర్, మిచ్ ఓవెన్ దాదాపుగా వినాశకరమైన సంఘటనలో చిక్కుకున్నారు. మే 10, శనివారం ఉదయం పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలో, ఇస్లామాబాద్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం నుంచి విదేశీ ఆటగాళ్ళు తమ చార్టర్ విమానంలో బయలుదేరిన కొన్ని గంటల తర్వాత, భారత్ మూడు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులను ప్రారంభించింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఇరుదేశాల సరిహద్దు కాల్పుల మధ్య పాకిస్తాన్ పౌర విమానాలను కవచంగా ఉపయోగించుకుందని భారత్ ఆరోపించింది. క్షిపణి దాడులు చేయకుండా పాక్ విమానాలను నడిపిందని పేర్కొంది.