అమరావతి: వైసిపి సభ్యులు ముందు అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. అసెంబ్లీకి రాకుండా ప్రశ్నోత్తరాలకు ప్రశ్నలు పంపుతామంటే కుదరదని హెచ్చరించారు. అసెంబ్లీకి వస్తామంటే రెండు ప్రశ్నలు వైసిపికి కేటాయిస్తామన్నారు. వైసిపి నేతలు రాకపోతే ఆ రెండు ప్రశ్నలు ఇతర పార్టీలకు ఇచ్చేస్తామన్నారు. వైసిపి సభ్యులు అసెంబ్లీకి రాకుండా ప్రశ్నలు అడిగి సమయాన్ని వృథా చేస్తున్నారని దుయ్యబట్టారు. శాసన ఆవరణలో కొత్త మెషినరీని స్పీకర్ ప్రారంభించారు. గత ఐదేళ్లలో అసెంబ్లీ కేవలం 75 రోజులే జరిగిందని, కూటమి పాలనలో ఇప్పటికే 31 రోజులు అసెంబ్లీ జరిగిందని వివరించారు.
పులివెందులలో వైసిపి ఓడిందని మాజీ సిఎం జగన్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తోందని మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేశారని, నామినేషన్ కూడా వేయనీయకుండా జగన్ పులివెందులలో పాలించారని దుయ్యబట్టారు. పులివెందుల ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. సిఎం చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా జగన్ వ్యాఖ్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 17 లేదా 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ప్రకటించారు.