దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై గల బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి మంగళవారం నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 1,064 అడుగుల వద్ద 15,567 టిఎంసిల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. బాబ్లీ గేట్లు తెరుచుకోవడంతో ఎస్‌ఆర్‌ఎస్‌పిలో నీరు చేరనుంది. బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో నిజామాబాద్ జిల్లా, కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి గలగలా పారుతూ పరవళ్ళు తొక్కుతోంది. ఇరు రాష్ట్రాల ఒప్పందాల ప్రకారంగా జులై మొదటి తేదీన గేట్లు ఎత్తివేయడంతో త్రివేణి సంగమం వద్ద నీటితో కళకళలాడింది.
జిల్లా ఇరిగేషన్ అధికారులు బాబ్లీ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న నీటి మట్టాన్ని పరిశీలించి, గేట్లను ఎత్తివేయించారు. బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న ఎత్తిపోతల పథకాల ద్వారా వినియోగించుకోవడానికి ఈ నీరు ఉపయోగపడుతుందని రైతులు, మత్సకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూలై 1 నుండి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచాలన్న సుప్రీంకోర్టు నిబంధనలు తెలిసినవే. అనుకున్నంత స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో బాసర గోదావరికి బాబ్లీ ద్వారా కొంత వరద వచ్చే అవకాశం ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.