మన తెలంగాణ/గండిపేట్/బాలాపూర్: వినాయకుడి లడ్డుకు ఎంతటి ప్రాధాన్యత, క్రేజీ ఉన్న విషయం తెలిసిందే. వేలు.. లక్షలు, కోట్లు ధరలు పెట్టి గణనాధుడిల డ్డూలను కైవసం చేసుకున్నారు. బండ్లగూడ జాగీరులో రికార్డు స్థాయిలో రూ.2.32 కోట్లు పలకగా, బాలాపూర్ వినాయకుడి లడ్డూను రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. కాగా, కొత్తపేట్‌లో ఓ విద్యార్థి అనూహ్యంగా కేవలం రూ.99కే దక్కించుకోవడం విశేషం.
రూ.2.32కోట్లు పలికిన లడ్డూ
నగర శివార్లలోని రిచ్‌మండ్ విల్లాలో గణనాథుడి లడ్డుకు రికార్డు ధర పలికింది. విల్లా సభ్యులు ఏకంగా రూ.2.32 కోట్లకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో లడ్డు ధర గతేడాది కన్నా భారీగా పలకడం గమనార్హం. గండిపేట్ మండల పరిధిలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని రిచ్‌మండ్ విల్లాస్‌లో ప్రతి యేడాదిలాగే ఈ ఏడాది సైతం గణనాధుని లడ్డు వేలంపాట అంద రి దృష్టిని ఆకర్షించింది. గత ఏడాది ఇక్క డ గణపతి లడ్డూ వేలంపాటలో రూ.1.87 కోట్లు పలికిన విషయం తెలిసిందే. ఈసారి 10 కేజీల గణపతి లడ్డు వేలం పాటలో అత్యధికంగా రూ.2.32కోట్లు పలికి చరిత్ర సృష్టించింది. వేలం పాటలో కమ్యూనిటీ సభ్యులు ఈ లడ్డును దక్కించుకోవడం మరో విశేషం. వేలం పాట ద్వారా వచ్చే ఈ డబ్బుతో రిచ్‌మండ్ విల్లా ద్వారా ఏర్పాటుచేసిన ట్రస్టు తరపున ప్రతియేటా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని నిర్వాహకులు తెలిపారు. అనాథ పిల్లలకు, వృద్దులకు చేయూత నిస్తున్నామని తెలిపారు. విల్లా సభ్యులందరీ సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
బాలాపూర్‌లో రూ.35లక్షలు
బాలాపూర్ వినాయకుడి లడ్డుకు రికార్డుస్థాయి ధర పలికింది. శనివారం నిర్వహించిన వేలం పాటలో కర్మన్‌ఘాట్‌కు చెందిన స్టీల్‌వ్యాపారి, బిజెపి నేత లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డు అంటే తనకు ఎంతో ఇష్టమని..వేలం పాటలో దక్కించుకున్న ఈ లడ్డును ప్రధాని నరేంద్రమోడికి అందజేస్తానని దశరథ్‌గౌడ్ తెలిపారు.
రూ.99కే దక్కించుకున్న విద్యార్థి
కొత్తపేట్‌లో అనూహ్యంగా కేవలం 99 రూపాయలకే వినాయకుడి లడ్డును విద్యార్థి దక్కించుకోవడం విశేషం. కొత్తపేట్ ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి లడ్డుకు లక్కీ డ్రా చేపట్టారు. ఈ డ్రాలో బిబిఏ చదువుతున్న సాక్షిత్‌గౌడ్ రూ.99కే 333 కేజీల లడ్డూను కైవసం చేసుకున్నారు. లక్షలు, కోట్ల రూపాయలు పలుకుతున్న వినాయకుడి లడ్డును కేవలం 99 రూపాయలకే దక్కించుకోవడం విశేషం.
ఖానాపూర్‌లో రూ.14 లక్షలు
గండిపేట్ మండల పరిధిలోని ఖానాపూర్‌లోని శ్రీ వరసిద్ది వినాయక లడ్డును రూ.14.01లక్షలకు మస్కూరి శంకరయ్య కుటుంబ సభ్యులు వేలంపాటలో దక్కించుకున్నారు.
అత్తాపూర్‌లో రూ.12.51 లక్షలు
అత్తాపూర్‌లోని న్యూస్టార్స్ భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి లడ్డును గుమ్మడి భూపాల్‌రెడ్డి కుటుంబం రూ.12.51లక్షలకు దక్కించుకున్నారు.