కరీంనగర్: దేశంలో ఎక్కడా లేని రీతిలో అవినీతి, కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణలో జరుగుతున్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి రూ.1,137 కోట్ల అమృత కాంట్రాక్ట్ ఇచ్చిందని కెటిఆర్ విమర్శించారు. అంతేకాక.. బిజెపి ఎంపి సిఎం రమేశ్‌కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ కట్టబెట్టిందని ఆయన ఆరోపించారు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్రంగా స్పందించారు.
బిఆర్ఎస్ పార్టీని నడిపే పరిస్థితుల్లో లేరని, ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని బండి సంజయ్ ఆరోపించారు. పార్టీని నడిపే పరిస్థితి లేకే బిజెపిలో విలీనం చేస్తామని అన్నారని ఆయన అన్నారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ కెటిఆర్‌కు సిరిసిల్ల టికెట్ మొదట ఇవ్వకపోతే.. టికెట్ ఇప్పించాలని సిఎం రమేశ్‌ని కలిశారని.. సిఎం రమేశ్ కెటిఆర్‌కు టికెట్ ఇప్పించారని అన్నారు. అయన ఆర్థిక సహాయం కూడా చేశారని తెలిపారు. సిఎం రమేశ్ విషయంలో కెటిఆర్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమని బండి (Bandi Sanjay) స్పష్టం చేశారు.