Monday, June 23, 2025

కెసిఆర్‌కు రేవంత్ సర్కారే రక్షణ కవచం:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

కెసిఆర్‌కు రేవంత్ సర్కారే రక్షణ కవచంలా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కుటుంబానికి ఎటిఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బిజెపిపై విషప్రచారం జరుగుతోందని, ఈ ప్రాజెక్టు విషయంలో తమ పార్టీ స్టాండ్ వెరీ క్లియర్‌గా ఉందని, ప్రధానమంత్రి మోడీ చెప్పిన మాటలే పార్టీ విధానం అన్నారు. ఈ ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అన్నారు. గత ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమని, దీనిపై సిబిఐ విచారణ జరపాలని రాహుల్ గాంధీ చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.2 లక్ష కోట్ల అంచనాలు పెంచిన కెసిఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ఇన్ని లక్షల కోట్లతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.

11 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతూ నీతివంతమైన పాలన అందిస్తున్న మహానాయకుడు మోడీ ఏ ఆధారాల్లేకుండా కాళేశ్వరం కెసిఆర్ కుటుంబానికి ఎటిఎంగా మారిందని చెబుతారా? ఆలోచించాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులే వందల కోట్లు సంపాదించారంటే, ఇక కెసిఆర్ కుటుంబం ఏస్థాయిలో అవినీతికి పాల్పడిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ కుటుంబాన్ని వదిలేసి కొందరు అధికారులనే బలి చేయాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కెసిఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా ఇంకా ఎందుకు ఆయనను అరెస్ట్ చేయడం లేదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విచారణపై తమకు నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరపాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. కేబినెట్ ఆమోదం, సబ్ కమిటీ సిఫారుసులతో కాళేశ్వరం కట్టా రని బిఆర్‌ఎస్ చెబుతుంటే… ఆ ఆధారాలు ఎందుకు బయటపెట్డడం లేదని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు కదా? వాస్తవాలు ఆధారాలతో సహా ప్రజల ముందుంచాలని కోరుతున్నామని అన్నారు.

కాళేశ్వరం వల్ల వచ్చిన లాభమేంది? రూ.లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దోచుకోవడం తప్ప సాధించిందేముంది? కాళేశ్వరం వల్ల భూగర్భజలాలు పెరిగాయి.. పంట దిగుబడి పెరిగింది.. కాల్వలు నిండాయని చెప్పడం పచ్చి అబద్ధం అని మండిపడ్డారు. కాళేశ్వరంలో నీళ్లు లేకపోయినా ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చింది కదా? మరి దీనికేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వానలు పడి కాలువలు, చెరువులు నిండితే కాళేశ్వరం వల్లే అవనీ నిండినట్లు ఫోజులు కొట్టిన దుర్మార్గులు బిఆర్‌ఎస్ నేతలని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు సాగాలన్నదే తమ పార్టీ అభిమతం అన్నారు. ‘కెసిఆర్‌కు నోటీసులు ఒట్టి డ్రామా…. అందుకే ఎన్ని కేసులున్నా అరెస్ట్ చేయడం లేదు.. మాకు అధికారం ఉంటే ఈపాటికే కెసిఆర్‌ను, అవినీతిపరులను ఎప్పుడో జైల్లో వేసేవాళ్లం. రాష్ట్ర ప్రభుత్వంతో పనిలేకుండా కేంద్రమే నేరుగా సిబిఐతో విచారణ చేయించే అవకాశముంటే… కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈపాటికే వాళ్లను బొక్కలో వేసేవాళ్లం’ అని అన్నారు.

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వేర్వేరు కాదు..
నిజానికి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు వేర్వేరు కానేకాదని, సంయుక్తంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు నాణేనికి బొమ్మాబొరుసులాంటివి. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేనందునే డిజైన్‌ను మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర 165 టిఎంసిల నీటి లభ్యత ఉందని సాక్షాత్తు సిడబ్ల్యూసిఎ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడితే రూ.38 వేల కోట్లతోనే పూర్తయితది, కానీ కెసిఆర్ కుటుంబానికి కమీషన్లు రావు.. అందుకే కాళేశ్వరం పేరుతో డిజైన్‌ను మార్చి 38 వేల కోట్ల ప్రాజెక్టును 1 లక్షా 20 వేల కోట్లకు పెంచి ఎటిఎంలా వాడుకున్నరని ఆరోపించారు.

‘కాళేశ్వరం సహా అన్ని నిర్ణయాలు కెసిఆర్ ఒక్కరే సొంతంగా తీసుకున్నారన్నది నిజం. ఆ మాట ఆయనే చాలాసార్లు చెప్పిండు కదా. నదులకు నడక నేర్పింది కెసిఆరేనని ఆ కుటుంబమంతా మాట్లాడింది కదా? ఇయాళ ఎందుకు మాట మారుస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం తనది కాదని ఎందుకు తోకముడుస్తున్నారు..? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టు స్థలాలపై మంత్రి ఉత్తమ్‌తో మట్లాడతా..
కరీంనగర్ జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలకు సంబంధించిన ఫైల్ విషయంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడానని పేర్కొన్నారు. సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితోనూ మాట్లాడి తప్పకుండా స్థలాలిచ్చేలా కృషి చేస్తానని అన్నారు. మిగిలిన అర్హు లైన జర్నలిస్టులందరికీ కూడా స్థలాలు ఇప్పించేందుకు యత్నిస్తానని తెలిపారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే తప్పకుండా స్థలాలిచ్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News