Monday, September 15, 2025

ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వేస్టేషన్ల అభివృద్ధి: బండి సంజయ్‌

- Advertisement -
- Advertisement -

మంచిర్యాలలో రూ.26 కోట్లతో అమృత్ భారత్ పనులు
రూ.3.50 కోట్లతో పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడి
మంచిర్యాలలో వందే భారత్ రైలు స్టాపేజీ ప్రారంభం

మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్ 20101 నాగ్‌పూర్-సికింద్రాబాద్ రైలు స్టాపేజీని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, శాశన మండలి సభ్యుడు అంజిరెడ్డి, డిఆర్‌ఎం గోపాలకృష్ణన్, రఘు, ముఖ్య ప్రజా సంబందాల అధికారి శ్రీధర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఏ ప్రాంత అభివృద్ధి అయినా రైలు మార్గం, రోడ్డు మార్గం, విమాన మార్గాలతో ముడిపడి ఉంటుందని అన్నారు. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. మంచిర్యాలలో రూ.26 కోట్ల అమృత్ భారత్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. రూ.3 కోట్ల 50 లక్షలతో మంచిర్యాలలో పుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2019లో దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా 150 వందే భారత్ రైళ్లను ప్రారంభించామని, ఒక్కొక్క రైలు విలువ రూ.130 కోట్లు అని అన్నారు. తెలంగాణలో 5 వందే భారత్ రైళ్లు నడిపిస్తామనిన అన్నారు. హైదరాబాద్ నుండి పుణే, హైదరాబాద్ నుండి నాందేడ్‌కు వందే భారత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

2014 ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి రూ.258 కోట్లు కేటాయించారని, 2025లో రూ.5 వేల 337 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని అన్నారు. రూ.80 వేల కోట్లతో చేపట్టిన 40 ప్రాజెక్టులలో భాగంగా 4 వేల 300 కిలోమీటర్ల మేరకు రైల్వే ట్రాక్ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. రూ.42 వేల కోట్లతో పనులు కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర మంత్రి వివేకానంద మట్లాడుతూ.. ఈ ప్రాంతం నుండి ఉదయం వేళల్లో హైదరాబాద్‌కు రైళ్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వందే భారత్‌కు మంచిర్యాలలో స్టాప్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మంచిర్యాల నుండి శబరిమలై వెళ్లేందుకు కేరళ ఎక్స్‌ప్రెస్‌ను మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు.రూ.10 వేల కోట్లతో రామగుండం యూరియా ప్లాంట్ రీఓపెనింగ్ చేయించామని, మరొక ప్లాంట్ ఏర్పాటు చేసినట్లయితే యూరియా కొరత ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఇందిరమ్మ ఇళ్లకు రూ.1435 కోట్ల చెల్లింపులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News