త్యాగాల గాంధీ కుటుంబం మీద బండి సంజయ్
చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
మనతెలంగాణ/హైదరాబాద్: త్యాగాల గాంధీ కుటుంబం మీద బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్రమంత్రి బండి సంజయ్ మతి తప్పి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిదని, ఆ కుటుంబాన్ని పట్టుకొని డూప్లికేట్ గాంధీ కుటుంబం అని కామెంట్ చేయడం దారుణమన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ దేశం కోసం నెహ్రూ జైలుకు వెళ్లారని, తన ఆస్తి అంతా ధారపోశారని, ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారని ఆయన అన్నారు.
రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం అయ్యారని, సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని, రాహుల్ గాంధీ నిస్వార్థంగా దేశం కోసం పనిచేస్తున్నారని, బిజెపి నాయకులు ఈ దేశం కోసం చేసింది ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఒక్క బిజెపి నాయకుడిని బండి సంజయ్ చూపించాలని, దేశం పేరు చెప్పుకొని బతకడం తప్ప బిజెపి చేసింది ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. అసలు ఈ దేశంలో ఇప్పుడున్నది నకిలీ బిజెపి అని ఆయన ఆరోపించారు. వాజపేయి, ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లతోనే అసలు బిజెపి పోయిందని, నకిలీ బిజెపిలో ఇప్పుడున్నదంతా నకిలీ నాయకులేనని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉంటే కేంద్రమంత్రిగా ఆయనే ముందు అధికారికంగా సమాచారం ఇవ్వాలన్నారు. మజ్లిస్‌ను బూచీగా చూపించి ఇంకెంత కాలం బ్రతుకుతారని ఆయన ప్రశ్నించారు. సోనియా గాంధీ, ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ ముందుకు వెళుతోందని, 400 సీట్లు గెలుస్తామని హడావుడి చేసిన బిజెపి కేవలం 240 సీట్లకు పరిమితం అయ్యిందని ఆయన పేర్కొన్నారు.