బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం సోమవారం నాడు రాజధాని ఢాకాలో ఒక స్కూల్ భవనంపై కూలిపోవడంతో 19 మంది చనిపోయారు. 70 మందికి పైగా గాయపడ్డారు. చైనాలో తయారైన ఎఫ్ -7 జెట్ విమానం ఢాకాలోని ఉత్తరాప్రాంతంలోని మైల్ స్టోన్ స్కూల్ , కాలేజీ భవనంపై కూలిపోయింది. స్కూల్ లోనూ, కాలేజీలోనూ తరగతులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫలితంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. వారిని వెంటనే
సమీపంలోని ఆరు ఆస్పత్రులకు తరలించేందుకు రిస్క్యూ టీమ్ లు , సిబ్బంది కృషి చేస్తుంటే ప్రమాద స్థలంలో పెద్దఎత్తున మంటలు, దట్టమైన నల్లటి పొగ అలుముకోవడం టెలివిజన్ ఫుటేజ్ లో కన్పించింది. ఫలితంగా సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఎఫ్ -7 బిజిఐ శిక్షణ విమానం మధ్యాహ్నం 1.06 ప్రాంతంలో
ఉత్తరాలో కూలిపోయిందని సైన్యం పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకటించింది.
ప్రమాదం వార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక దళ సిబ్బంది రంగంలోకి దిగి, కూప్పకూలిన విమానం శిథిలాలపై నీరు కుమ్మరించారని రాయిటర్స్ పేర్కొంది. కాగా, గాయపడిన 70 మందిలో దాదాపు 48 మంది పరిస్థితి విషమంగా ఉందని హెల్త్ డిపార్ట్ మెంట్ చీఫ్ అడ్వైజర్ , డాక్టర్ సయ్యదూర్ రెహమాన్ తెలిపారు.విద్యార్థులలో చాలా మంది కాలిన గాయాలతో, తీవ్రంగా రక్తం కారుతుండగా పరుగులు పెట్టడం కన్పించింది. మృతులలో మూడో క్లాస్ విద్యార్థి, 12,14 ఏళ్ల పిల్లలతో పాటు 40 ఏళ్ల వ్యక్తి , పలువురు కూడా తమ ఆస్పత్రిలో చేరినట్లు డాకా మెడికల్ కాలేజీ, బర్న్ యూనిట్ కు చెందిన బిధాన్ సర్కార్ తెలిపారు.అంబులెన్స్ లు వెంటనే అందుబాటులో లేకపోవడంతో ఆర్మీ సిబ్బంది విద్యార్థులను తమ చేతుల్లో మోస్తూ, రిక్షాలు, వ్యాన్ లలో వివిధ వాహనాల పైన అస్పత్రికి తరలించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం మూడు అంతస్థుల పాఠశాల ముందు భాగంలో కూలిపోవడంతో ఎక్కువమంది విద్యార్థులే ప్రమాదం పాలయ్యారు.
19 మందికి పైగా మరణించగా చాలామంది గాయపడ్డారని ఓ టీచర్ తెలిపారు. స్కూల్, కాలేజీ టీచర్లు, ఇతర సిబ్బంది వెంటనే విద్యార్థులను రక్షించేందుకు చర్చలు చేపట్టారు. కాగా, బంగ్లాదేశ్ వైమానిక దళం ప్రమాద కారణాలను కానీ, కనీసం పైలెట్ బతికి ఉన్నాడా లేదా అన్న విషయాన్ని కానీ ప్రకటించలేదు. ప్రమాదంపై బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయిస్తామన్నారు. విద్యార్థులు, టీచర్లకు జరిగిన నష్టం పూడ్చలేదనిదని, ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అన్నిరకాల సహాయాన్ని కల్పిస్తామన్నారు.