Wednesday, May 28, 2025

చైనా సాయంతో మూతపడిన ఎయిర్‌బేస్ పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

చైనా సాయంతో రంగ్‌పూర్ డివిజన్‌లోని రెండో ప్రపంచయుద్ధం నాటి లాల్‌మోనిర్‌హట్ ఎయిర్ బేస్‌ను పునరుద్ధరించాలని బంగ్లాదేశ్ ఆలోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు భారత ప్రభుత్వ వర్గాలు ఆందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మూతపడిన ఈ ఎయిర్‌బేస్‌ను పునరుద్ధరించడమంటే భారత్ ముంగిట చైనా మిలిటరీ అడుగు పెట్టడానికి అవకాశం కల్పించడమే అవుతుంది. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుకు 20 కిలోమీటర్ల లోపే ఈ బేస్ ఉంది. అంతేకాదు, ఏడు ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర భాగాలతో అనుసంధానం చేసే 22 కిలోమీటర్ల మేర ఉండే సిలిగురి కారిడార్‌కు 20 కిలోమీటర్లకన్నా తక్కువ దూరంలోనే ఈ బేస్ ఉండడం కూడా భారత ప్రభుత్వ వర్గాల ఆందోళనకు కారణమవుతోంది. ‘ చికెన్ నెక్’గా పిలవబడే ఈ కారిడార్‌కు పశ్చిమాన నేపాల్, ఉత్తరాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి.

ఈ రెండు దేశాలతో భారత్ సంబంధాలు స్థిరంగానే ఉన్నాయి కానీ ఇటీవలి కాలంలో నేపాల్‌లో 2018లో రద్దయిన రాచరిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతుండడం కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక వేళ చైనా గనుక లాల్‌మోనిర్‌హట్ బేస్‌ను పునరుద్ధరించడానికి నిధులు సమకూర్చిన పక్షంలో ఒప్పందంలో భాగంగా చైనా అక్కడ యుద్ధ విమానాలు, నిఘా పరికరాలు లాంటి మిలిటరీ ఆస్తులను అక్కడ ఉంచడానికి వీలు కలుగుతుంది. ఈ ఆందోళనల దృష్టా భారత్ ఉత్తర త్రిపురలోని కౌలాషహర్ లో ఉన్న మూడు దశాబ్దాల నాటి పౌర విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని నుకొంటోంది. ఈ విమానాశ్రయం పౌర విమానాల వినియోగానికి వీలుగా ఉంటూనే ఈశాన్య రాష్ట్రాల్లోని మిగతా విమానాశ్రయాల మాదిరిగా అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు, ఇతర విమానాల రాకపోకలకు, ఇంధనం నింపుకోవడానికి ఉపయోగించే వీలు ఉంటుంది.

పెద్దగా ఉపయోగించని ఈ విమానాశ్రయాన్ని తిరిగి చైతన్యం చేయడం కేవలం బంగ్లాదేశ్ చర్యకు ప్రతిస్పందనే కాదు, ఆ దేశానికి ఓ హెచ్చరిక కూడా అవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగినప్పటినుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా ఆ ప్రభుత్వం ఇప్పటికీ బంగ్లాదేశ్‌లో ఎన్నికల తేదీలను ప్రకటించలేదు సరికదా, భారత ప్రభుత్వంతో స్నేహంగాఉండడం కూడా లేదు. పైగా పాక్, చైనాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిండడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో భారత సరిహద్దులకు అత్యంత చేరువలోని ఎయిర్‌బేస్‌ను పునరుద్ధరించడానికి చైనా సాయం అందించడం మనకు అందోళన కలిగించే అంశమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News