యూనస్ పై మాజీ ప్రధాని షేక్ హసీనా విమర్శ
న్యూఢిల్లీ: మహమ్మద్ యూసన్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని అమెరికాకు అమ్మేస్తున్నారని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా విమర్శించారు. తన అవామీలీగ్ పార్టీ ని యూనస్ సర్కార్ నిషేధం విధించడాన్ని ఆమె ఖండించారు. అది రాజ్యాంగ విరుద్ధమన్నారు. తన పార్టీ ఫేస్ బుక్ ఖాతాలో షేక్ హసీనా ఆడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. యూనస్ తీవ్రవాద గ్రూప్ ల సాయంతో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అధిపత్యాన్ని చేజిక్కించుకున్నారని ఆమె విమర్శించారు.
విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమం ఉధృతంగా మారడంతో అప్పటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, బంగ్లాదేశ్ నుంచి పరారైన తర్వాత 2024 ఆగస్టు 7న మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి తాత్కాలిక నాయకుడుగా నియమితులయ్యారు.
డిసెంబర్ లోగా బంగ్లాదేశ్ లో సార్వత్విక ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ హెచ్చరించిన నేపథ్యంలో యూనస్ రాజీనామా చేస్తానని బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ఈ విమర్శలు చేశారు. తన ప్రభుత్వంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన యూనస్ తన ప్రభుత్వం తీవ్రంగా కంట్రోల్ చేసిన టెర్రరిస్ట్ లకే ప్రభుత్వ పగ్గాలు
అప్పగించారని ఆమె విమర్శించారు. సెయింట్ మార్టిన్స్ ద్వీపం కోసం అమెరికా చేసిన డిమాండ్ ను బంగ్లా తొలి ప్రధాని ఆమె తండ్రి ముజిబుర్ రహ్మాన్ అంగీకరించలేదని, దానికోసమే ఆయన తన ప్రాణాలు అర్పించారని, అలాగే తాను అధికారంలో ఉన్నంతకాలం దేశాన్ని అమ్మాలని తాను ఎన్నడూ
అనుకోలేదని షేక్ హసీనా వివరించారు.