దేశంలో 2014 తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులలో పారు బాకీలు పేరుకుపోతున్నాయి. బ్యాంకులలో మొండి బకాయిలను రాబట్టడంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు మీనమేషాలు లెక్కిస్తున్నవి. ప్రభుత్వాధినేతల అండదండలతో కార్పొరేట్ వర్గాలు, సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న వేలకోట్ల రూపాయలు తిరిగి చెల్లించకపోవడంతో మొండి బకాయిలుగా మారుతున్నాయి. అటువంటి వారిపై కఠినచర్యలు తీసుకోవడానికి బ్యాంకు అధికారులు వెనుకాడుతున్నారు. గత పది సంవత్సరాల బిజెపి ప్రభుత్వ పరిపాలన కాలం లో రూ. 12 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలను రద్దు (రైటాఫ్) చేసినట్లు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రుణాల రైటాప్‌కు సంబంధించి లిఖితపూర్వక సమాధానం ఇచ్చాడు.
గత పది సంవత్సరాల కాలంలో 2015 -16 నుండి 2024- 25 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు 12,08,828 కోట్ల రూపాయల పారు బాకీలను రైటాఫ్ (Write-debts) చేశాయని తెలిపారు. యుపిఎ 1 (2004- 2009), యుపిఎ -2 (2009- 2014) పరిపాలనా కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ. 1.58,994 కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేసినట్లు వివిధ గణాంకాలు చెబుతున్నాయి. బిజెపి పరిపాలనా కాలంలో 2014 2024 వరకు ఏకంగా రూ. 12.08 లక్షల కోట్ల పారుబాకీలను రద్దు చేసినట్లు స్వయంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో వెల్లడించడం జరిగింది. యుపిఎ పరిపాలనా కాలంలో మొండిబకాయిల రద్దు (రైటాప్)తో పోల్చితే మోడీ హయాంలో బడా కార్పొరేట్లు, అత్యంత సంపన్నులకు భారీ స్థాయిలో బ్యాంకు రుణాలు రద్దు (రైటాప్) కావడం నివ్వెరపరుస్తోంది.
ప్రభుత్వంలోని పెద్దలకు, కార్పోరేట్ సంపన్నులకు మధ్యనున్న అవినాభావ సంబంధాలే పెద్ద మొత్తంలో పారుబాకీల రద్దుకు కారణమనే కోణంలో విమర్శలున్నాయి.బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న కంపెనీలు, వ్యక్తులు ఆ రుణాలను తిరిగి చెల్లించకపోతే వాటిని బ్యాంకులు మొండి బకాయి (జిఎన్‌పిఎ) లుగా మార్చుతాయి. స్థూల ఎన్‌పిఏ అంటే బ్యాంకులలో చెల్లించని అప్పుల మొత్తాన్ని సూచించడానికి ఉపయోగించే పదం. ఇది నిరర్థక రుణాలుగా వర్గీకరించబడుతుంది. నాలుగేళ్ల కాలవ్యవధి దాటిన ఎన్‌పిఎలను బ్యాంకులు రద్దు ( రైటాఫ్) చేసి బ్యాంకుల బ్యాలెన్స్ షీట్‌ల నుంచి తీసివేస్తాయి. బ్యాంకులు మొండి బకాయిలను రైటాఫ్ చేసిన ప్రతిసారి రుణాలను పూర్తిగా రద్దు చేసినట్లు కాదని వాటిని తిరిగి వసూలు చేయడానికి బ్యాంకులు వివిధ పద్ధతుల ద్వారా ప్రయత్నించి వసూలు చేస్తాయని ఆర్థిక మంత్రులు వల్లే వేయటం పరిపాటిగా మారిపోయింది.
వివిధ ఆర్థిక సంవత్సరాలలో రికవరీ అయిన పారు బకాయిల మొత్తం చాలా తక్కువ మొత్తాలలోనే ఉంటున్నది. వివిధ నివేదికల ప్రకారం రైటాఫ్ చేయబడిన బకాయిల రికవరీ 16 శాతానికి లోపునే ఉంటోంది. ఆర్‌బిఐ డేటా ప్రకారం 2014 తర్వాత బడా కార్పొరేట్లు, అపర కుబేరులు బ్యాంకులకు రుణాలను ఎగవేయటం స్పష్టంగా కనబడుతోంది. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, మోహిల్ చోక్సి బ్యాంకులను నిండా ముంచి విదేశాలకు పారిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించినట్లు విమర్శలు ఉన్నాయి. నేటికీ వారిని తిరిగి దేశానికి రప్పించడంలో ప్రభుత్వ చర్యలు నిరాశాజనకంగా ఉన్నాయి. దేశంలో ఆర్థిక నేరానికి పాల్పడి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దేశం విడిచి వెళ్లే ముందు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పి వెళ్లినట్లు ఆరోపించాడు. పార్లమెంటులోనే జైట్లీని కలిసి తన ప్రయాణంపై సమాచారం ఇచ్చినట్లు విజయ్‌మాల్యా పేర్కొనడం సర్వత్ర చర్చకు దారితీసింది.
అనిల్ అంబానీ బ్యాంకు రుణాలకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన కథనాలు బ్యాంకింగ్ వ్యవస్థనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల నుంచి తీసుకున్న వేలకోట్ల రూపాయలు మొండి బకాయిలుగా మారిపోయిన వైనం, అనిల్ అంబానీ కంపెనీలు బ్యాంకులను మోసగించిన పరిస్థితి దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అనిల్ అంబానీకి సంబంధించిన ఆర్ కామ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలు 2015 నుంచి ఎస్‌బిఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌ల నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో వేలకోట్ల రూపాయల రుణాలు పొందినట్లు వివిధ కథనాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం ఇప్పుడే నిద్రలేచినట్లుగా నటిస్తూ అనిల్ అంబానీ సంస్థలపై ఇడి దాడులతో విషయాన్ని పక్కదారి పట్టిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
సంపన్నుల నుంచి మొండి బకాయిలను వసూలు చేయడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఉద్దీపన పేరుతో పలు రాయితీలను ఇస్తోంది. పెట్టుబడులను పెంచడమనే సాకుతో 2019లో కార్పొరేట్ పన్నును 30% నుంచి 22 శాతానికి తగ్గించింది. ప్రభుత్వ చర్యలతో పారిశ్రామిక పెట్టుబడులలో ఏమాత్రం పురోగతి లేదు. కార్పొరేట్ పన్ను రాయితీతో కేంద్ర ప్రభుత్వం 1.84 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయింది. ఏటా సగటున లక్ష కోట్లకు పైగా సంపన్నుల, ఎగవేతదారుల మొండి బకాయిలను రైటాఫ్ చేసుకుంటూపోతోన్న ప్రభుత్వం, అన్నదాతల బ్యాంకు రుణ బకాయిలపై దృష్టి పెట్టకపోవడం దారుణమైన పరిణామం. బిజెపి ప్రభుత్వం గడచిన పదేళ్లలో ఒక్కసారైనా బ్యాంకులలో రైతు రుణాలను మాఫీ చేసిన దాఖలాలు లేవు. దేశంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, చీడపీడలు, దిగుబడులు పడిపోవడం, కూలీల ఖర్చు పెరిగిపోవడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం లాంటి పరిస్థితులతో వ్యవసాయదారులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. రుణభారంతో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాల ప్రకారం 2021లో 10,281, 2022లో 11,290 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోన్న క్రమంలో బిజెపి ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా రైతులను రుణ విముక్తులను చేయాలనే ఆలోచన రావడం లేదు. 2008లో యుపిఎ- 1 పాలనా కాలంలో సోనియా గాంధీ చొరవతో దేశవ్యాప్తంగా రైతుల రుణమాఫీ జరిగింది. ఆనాడు సుమారు 71 వేల కోట్ల రూపాయలతో రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ దిశలో చేసిన ప్రయత్నాలు శూన్యం. సామాన్య, మధ్యతరగతి ప్రజల సొమ్ముతోనే వ్యాపారంచేసే బ్యాంకులు వారికి రుణం కావాలంటే రకరకాల కాగితాలు, షూరిటీలు అడిగి పలు పర్యాయాలు తమ చుట్టూ తిప్పుకొని కొద్దిపాటి రుణాలు మంజూరు చేస్తున్నవి. కార్పొరేట్ పెట్టుబడిదారులకు రాజకీయ ప్రాబల్యంతో పిలిచి మరీ రుణాలు కట్టబెడుతున్నాయి.
ఇవి సక్రమంగా వసూలు కాకపోవడంతో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ అండదండలతో రైటాఫ్ చేస్తూ వారి పేర్లను కనీసం బయట పెట్టలేకపోతున్నాయి. ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించిన డబ్బును కార్పొరేట్ వర్గాలకు పందేరం వేస్తున్న బ్యాంకులు తిరిగి వాటిని వసూలు చేసుకోలేక రద్దు చేస్తుండటంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల నుంచి తాము తీసుకున్న కొద్దిపాటి రుణానికి సంబంధించి ఒకటి, రెండు ఇఎంఐలు కట్టకపోతే వారి పేర్లను రచ్చ చేయడం నిత్యం జరిగే పని. మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడం, లక్షల కోట్ల రూపాయలు రైటాఫ్ చేయడం వంటి కారణాల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోయి సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. బ్యాంకులు తమ నష్టాలను పూడ్చుకునేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నాయి.
బ్యాంకులు కొత్తగా జారీ చేసే రుణాల మీద వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. పొదుపు డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. ఖాతాదారుల ఖాతాల నుంచి వివిధ చార్జీల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవంగా వివిధ కంపెనీలు లాభాలు సాధిస్తున్నప్పటికీ దివాలా తీసినట్లు తమ ఖాతా పుస్తకాలలో చూపి బ్యాంకులకు రుణాలు ఎగవేస్తూ, మరలా కొత్త కంపెనీల పేరుతో వందల కోట్ల రూపాయలను రుణాలుగా పొందుతున్నారు. ఇలాంటి సంస్థలపై, వ్యక్తులపై కేంద్ర ప్రభుత్వము, రిజర్వు బ్యాంకు అప్రమత్తంగా ఉండి కఠిన చర్యలు గైకొనాలి. రుణాల ఎగవేతదారులను, మొండి బకాయిదారులను, సంస్థలను గుర్తించి వారు తీసుకున్న అప్పులను తిరిగి రికవరీ చేసినప్పుడే బ్యాంకులు పరిపుష్టమవుతాయి. సామాన్య ప్రజలు బ్యాంకులలో దాచుకున్న సొమ్ముకు భద్రత చేకూరుతుంది.
- బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి 94409 66416