నేటి ఆధునిక యుగంలో సామాజిక మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరుగుతుంది. వాట్సప్, ఫేస్బుక్, ఎక్స్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ఆన్లైన్ వేదికలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ సంబంధిత విషయాల తెలుసుకోవడానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. మారుమూల ప్రాంతాల అణచివేయబడిన వర్గాల గొంతును వినిపిస్తున్నాయి. సామాజిక చైతన్యానికి ఊపిరిలూదుతున్నాయి. కానీ రోజురోజుకు జనాలు వాటికి బానిసవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన ఈ ఆన్లైన్ వేదికలు ఇప్పుడు పిల్లల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆటపాటలతో సాగే బాల్యం మొబైల్ స్క్రీన్‌లో ఇరుక్కుపోయింది. వీటినుంచి పిల్లల్ని కట్టడి చేయడం తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించడంపై నిషేధం విధించింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో నడిచే ప్రయత్నం చేస్తుంది.
ఇటీవల తూర్పు ఫ్రాన్స్‌లోని నోజెంట్ పట్టణంలోని ఓ పాఠశాలలో విద్యార్థి దాడి ఘటన తర్వాత 15 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధించే యోచనలో (plan ban) ప్రభుత్వం ఉందని ఫ్రాన్స్ ప్రధాని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇయు నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని లేదా తామే అమలు చేస్తామన్న ప్రకటించాడు. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్న రెండో దేశంగా ఫ్రాన్స్ నిలిచే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాల కంటెంట్ పిల్లల మనస్తత్వంపై తీవ్రప్రభావం చూపుతుంది. దుష్ప్రవర్తనకు కారణం అవుతున్నాయి. వీటిని నియంత్రించకపోతే భవిష్యత్తు భావి పౌర సమాజం అంధకారమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పలు దేశాలు సామాజిక మాధ్యమాలనుంచి పిల్లలను దూరంగా చేయాలని ఆలోచిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులనుంచి కూడా ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంది.
పిల్లలు ఎదుగుతున్న దశలో సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్‌లకు బానిసవడం వలన వారిలో విపరీత ప్రవర్తన, దూకుడు స్వభావం పెరుగుతుంది. విలువలు పతనమవుతున్నాయి.సామాజిక మాధ్యమాల కంటెంట్ పిల్లలను కొన్నిసార్లు తప్పుదారి పట్టిస్తున్నాయి.సామాజిక మాధ్యమాలు తరచూ వీక్షించడం వలన పిలల్లో ఓపిక, సహనం, ఆలోచనశక్తి నశిస్తుంది. విద్య విషయాలలో వెనకబడుతున్నారు. పిల్లలు పెద్దలపట్ల గౌరవం మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా గల భారతదేశంలో బాలల జనాభా కూడా అధికం. పిల్లలు సామాజిక మాధ్యమాల బారినపడకుండా చూడడం చాలా అవసరం. ప్రభుత్వ పరంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి. 2023లో కర్ణాటక హైకోర్టు పాఠశాల పిల్లలు సామాజిక మాధ్యమాలకు అధికంగా వ్యసనం కావడం, దాని ప్రతికూల ప్రభావాల గురించి ఆందోళనల వ్యక్తం చేసింది.
ఈ మేరకు కోర్టు వీటిని వినియోగించడానికి 21 సంవత్సరాల వయోపరిమితిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సామాజిక మాధ్యమాల్లో రోజురోజుకు అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి కట్టడికి మార్గదర్శకాలు రూపొందించండనీ అటార్నీ జనరల్‌కు సుప్రీం కోర్టు ఆదేశించింది. పిల్లల్లో నేరప్రవృత్తి, వింతప్రవర్తన పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను డిజిటల్ డిటాచ్ చేయడం అనేది ముఖ్యమైన అంశం. వారు సెల్ ఫోన్లు వినియోగిస్తున్నప్పుడు ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. వారిలో విపరీత పోకడలను సరిదిద్దాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి ఫోన్ హాలిడే పెట్టుకోవాలి.
ఇటీవల చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్ గావ్ జిల్లా గహీరాబేడీ గ్రామ పంచాయతీలో ఓ వినూత్న తీర్మానంచేశారు. గ్రామంలోని పిల్లలు ఫోన్ గేములు ఆడితే తల్లిదండ్రులకు రూ. 3,000 జరిమానా విధిస్తామని ఆంక్షపెట్టారు. ఈ సమాచారం ఇచ్చినవారికి బహుమతిగా రూ. 1,000 అందజేస్తామని కూడా ప్రకటించారు. దీంతో ఆ గ్రామంలో చాలావరకు మార్పు కనిపించింది. ఇలాంటి కట్టడి ప్రతి గ్రామంలో రావాలి. చరవాణి వ్యసనం నుంచి పిల్లలు దూరం చేయాలంటే వారిని ప్రకృతితో మమేకం చేయాలి. కుటుంబ బంధుత్వాలు, విలువల గురించి బోధించాలి. పిల్లలతో కలిసి ఆడుకోనివ్వాలి. భారత్‌లో భావప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాపై నియంత్రణ లేదు. కానీ స్వేచ్ఛ పేరుతో మితిమీరడం తగదు. పిల్లలు, యువత బాధ్యతయుత వినియోగంతో ముందుకెళ్లాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుతెరిగి నడుచుకోవాలి.
- సంపతి రమేష్ మహారాజ్, 79895 79428