ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరితమైన రాజధానిగా అపఖ్యాతి మూటగట్టుకుంటున్న ఢిల్లీ నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలి, తాగునీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించవలసింది పోయి కార్పొరేట్ కుట్రలకు తలవంచి ప్రజలపై మరిన్ని భారాలు మోపేందుకు వెనుకాడటంలేదని ఇటీవల పాతవాహనాలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకుండా నిషేధం విధించడం ద్వారా ఢిల్లీలోని బిజెపి ప్రభుత్వం నిరూపించింది. గత జులై 1 నుంచి 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలకు, 15 సంవత్సరాల కంటే పాతవైన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపకుండా నిషేధం అమలు జరిపారు. అయితే ఈ నిషేధంపై ఢిల్లీ ప్రజలనుండి తీవ్రమైన వ్యతిరేకత, ఆగ్రవేశాలు వ్యక్తం కావడంతో మూడు రోజులకే ఢిల్లీ ప్రభుత్వం వెనకడుగు వేసింది.
నిషేధాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఈ నిషేధాన్ని అమలు చేయడం ద్వారా ఆటో మొబైల్ రంగంలో అమ్మకాలు పెరుగుతాయని, ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో భారీగా ఆదాయం చేకూరుతుందని అంచనా వేశారు. అంటే ప్రధానంగా కార్ల కంపెనీలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతోనే ఈ నిషేధాన్ని అమలు చేసే ప్రయత్నం చేసినట్లు వెల్లడవుతుంది. ఈ నిషేధం కారణంగా అత్యధిక ప్రయోజనం భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకటైన టాటా గ్రూప్ మాత్రమే పొందగలదు. ఢిల్లీలో కార్లపై ఈ నిషేధం (ban cars Delhi) ప్రధానంగా టాటా గ్రూప్ నిధులు సమకూర్చే ఓ స్వచ్ఛంద సంస్థ సిఫార్సుల ఆధారంగా జరగడం గమనిస్తే ఇదంతా ఓ పెద్ద కార్పొరేట్ మోసంగా స్పష్టం అవుతుంది.
టాటా గ్రూప్‌లకు చెందిన ట్రస్ట్‌ల నుండి ప్రధానంగా విరాళాలు పొందుతున్న ఓ పర్యావరణ సంస్థ 2020లో విడుదల చేసిన నివేదిక సిఫార్సులను బట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి గతంలో షీలా దీక్షిత్ ప్రభుత్వం సమయం నుండే ఇటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి. అయితే అప్పటి నుండి ఏ ప్రభుత్వం కూడా వీటి అమలు పట్ల ఆసక్తి చూపలేదు. కానీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో టాటా గ్రూప్ నుండి భారీగా విరాళాలు పొందడంతో అధికారంలోకి రాగానే ఢిల్లీ ప్రభుత్వం దీని అమలు పట్ల ఆసక్తి చూపినట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. మీడియాను ప్రభావితం చేయడంలో ఇతర కార్పొరేట్ కంపెనీలకు భిన్నమైన ప్రజాసంబంధాల వ్యవస్థ టాటా గ్రూప్‌కు ఉండడంతో ఈ నిషేధం వెనుక ప్రభుత్వాన్ని ప్రభావితం చేసిన ఇటువంటి అంశాలపై మీడియాలో చెప్పుకోదగిన చర్చలు జరగలేదు.
‘ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాల దైనందిన జీవితాలను, జీవనోపాధిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. మా ప్రభుత్వం వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి పూర్తిగా కట్టుబడి ఉంది. పరిశుభ్రమైన, స్థిరమైన రవాణాకోసం దీర్ఘకాలిక పరిష్కారాలపై పనిచేస్తోంది’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తమ తప్పిదం నిర్ణయాన్ని అంగీకరిస్తూ పేర్కొనడం గమనార్హం. నిషేధం విధించే ముందు పర్యవసానాలను పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు 2018 నాటి సుప్రీం కోర్టు తీర్పును ప్రస్తావిస్తున్నది. 2018లో సుప్రీం కోర్టు తీర్పు ఢిల్లీలో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలను, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలను నిషేధించింది. అదే విధంగా, 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఉత్తర్వు కూడా 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేయడాన్ని నిషేధిస్తున్నది.
అయితే, ఆ విధంగా మూకుమ్మడిగా ఇంధన నిషేధం సాధ్యం కాదని, సాంకేతిక సవాళ్ల కారణంగా దానిని అమలు చేయలేమని ఇప్పుడు ఢిల్లీ పర్యావరణ శాఖమంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పష్టం చేస్తున్నారు. వాయు కాలుష్యం పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం చూపడం, వాయు కాలుష్యంతో వాహనాల నుండి వచ్చే కాలుష్యమే ప్రధాన కారణం అవడం నిజమే అయినప్పటికీ ప్రపంచం ఎక్కడ కూడా వాహనాల వయస్సునుబట్టి వాటి కాలుష్య స్థాయిని నిర్ధారించే వరవడి లేదు. ఢిల్లీ ప్రభుత్వం విచిత్రంగా దీనిని కనుగొంది. ఢిల్లీలో, 62 లక్షల ‘ఎండ్-ఆఫ్-లైఫ్’ వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఈ నిషేధాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దానితో నేరాలను నిరోధించలేని పోలీసులను పనికి, ఆసుపత్రులకు లేదా పాఠశాలలకు వెళ్లే వ్యక్తుల నుండి దాదాపు 200 వాహనాలను వెంబడించి స్వాధీనం చేసుకోవడానికి మోహరించారు.
కేవలం ఢిల్లీలోకి ప్రవేశించడం లేదా పెట్రోల్ పంపుల వద్ద ఆగడం అనే ‘నేరం’ కోసం వాహనదారులను శిక్షించే ప్రయత్నం చేశారు. వారి వాహనాలను బలవంతంగా లాక్కొని పౌరులను వేధించడంతో వినూత్నమైన వేధింపులకు దిగడం ద్వారా ఢిల్లీ ప్రభుత్వం తీవ్రమైన అపఖ్యాతిని మూటగట్టుకుంది.ఈ వాహన యజమానులలో చాలామంది కేవలం ఏడు సంవత్సరాల ఈఎంఐలను చెల్లించడం పూర్తి చేశారు. ఇప్పుడు, వారు కష్టపడి సంపాదించిన వాహనాలను ‘తుక్కు వాహనాలు’గా పరిగణించడంతో దిక్కుతోచక వారంతా దిగాలుపడ్డారు. ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉండడంతో గాలి నాణ్యతను పెంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. అంటే, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాలుష్య నియంత్రణ (పియుసి) జారీచేసే సర్టిఫికెట్లను ప్రభుత్వమే విశ్వసింపలేని పరిస్థితి నెలకొంది.
అభివృద్ధి చెందిన దేశాలు తమ పాత వాహనాలను ఒక పద్ధతి ప్రకార రోడ్ల మీదకు రాకుండా నివారిస్తాయి. వాహనాలను ఉద్గార ప్రమాణాలు, రహదారి యోగ్యత తనిఖీలు చేస్తాయి. అధిక కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా తొలగిస్తాయి.అంతేకానీ వాహనాల వయస్సును ప్రామాణికంగా తీసుకోవు. ముఖ్యంగా అమెరికాలో వాహనం వయస్సును ప్రామాణికంగా తీసుకోరు. కాలిఫోర్నియాలో స్మోగ్ చెక్ చేసి, వాహనాలు రోడ్డు మీద తిరగాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు. లండన్, పారిస్, బెర్లిన్ లలో సైతం తక్కువ ఉద్గార మండలం (ఎల్‌ఈజెడ్), అతి తక్కువ ఉద్గార మండలం (యుఎల్‌ఇజి) ఆధారంగా పాత వాహనాలను నిషేధించడం లేదా భారీ రుసుములు వసూలు చేయడం గానీ చేస్తారు. జర్మనీలో 3 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న అన్ని కార్లకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత కఠినమైన రహదారి యోగ్యత, ఉద్గార పరీక్షలను చేస్తారు. అందులో పాస్ అయితేనే వాటిని రోడ్డు మీదకు అనుమతిస్తారు.
ఢిల్లీలో 10 నుండి 15 సంవత్సరాల పాత వాహనాలకు ఇంధనం ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశించడం దేశ రాజధానిలోని సామాన్య ప్రజలను దోచుకోవడానికి జరిగిన ఓ పెద్ద కుట్రగా మాజీ మంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా ఆరోపించారు. 18 లక్షల కార్లు, 41 లక్షల బైక్‌లు ఢిల్లీలో ఉన్నాయని చెబుతూ మొత్తం 61 లక్షల కుటుంబాలు బిజెపి నిర్ణయం కారణంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల పేదలకు నష్టం చేకూరుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. వాహనాలను ఆధునీకరించాలని భావిస్తే, ఐరోపా, అమెరికా తరహా పద్ధతులను అవలంబించాలని, కఠినమైన, పారదర్శకమైన ఉద్గార పరీక్ష వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. గ్రీన్ జోన్లలో దశలవారీగా పాతవాహనాలను తొలగించాలని భావిస్తున్నారు. ఢిల్లీలో అమల్లోకి తేనున్న ఈ పద్ధతిని త్వరలోనే ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ అయితే అది శాస్త్రీయంగా జరగాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో నిషేధం అమలును నిలిపివేయక ఢిల్లీ ప్రభుత్వానికి తప్పలేదు. పలు సాంకేతిక సమస్యల వల్ల పాత వాహనాలకు ఇంధన నిషేధం కష్టసాధ్యమని గ్రహించినట్టు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా చెప్పడం గమనార్హం. అంటే, సాంకేతికమైన వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా, కేవలం కార్ల కంపెనీలకు ప్రయోజనం కల్పించడం కోసం, వారినుండి వస్తున్న ఒత్తిడుల మేరకు హడావుడిగా ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేసే ప్రయత్నం చేసినట్లు స్పష్టం అవుతుంది. తమ వాహనాలను ఎంతో ప్రేమతో చూసుకునే వ్యక్తులకు కష్టం కలిగించే బదులు, సరిగా నిర్వహించని వాహనాలను స్వాధీనం చేసుకునే ఓ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలపడం ద్వారా ఏదో విధంగా ఈ నిషేధాన్ని అమలు చేసే మార్గాల గురించి అన్వేషిస్తున్నట్లు సంకేతం ఇచ్చారు.
పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసిన ఎఎన్‌పిఆర్ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదని, కొత్త హై సెక్యూరిటీ ప్లేట్లను గుర్తించలేకపోతున్నాయని, వాహన వయసు ప్రకారం స్క్రాప్ చేయలేమని వెల్లడైందని మంత్రి ఈ సందర్భంగా నిషేధం అమలులో ప్రభుత్వ నిస్సహాయతను వివరించారు. ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాలపై నిషేధం కొత్తది కాదు. కానీ పెట్రోల్ పంపుల వద్ద ఇంధనాన్ని నిరాకరించడం ద్వారా దానిని అమలుచేస్తున్న విధానం కొత్తది. ఇంధనాన్ని తిరస్కరించే నిర్ణయం మధ్య తరగతిపై ప్రభావం చూపుతుంది. ఫిబ్రవరి 2025లో 27 సంవత్సరాల తర్వాత బిజెపి దేశ రాజధానిలో అధికారంలోకి వచ్చినప్పుడు గణనీయంగా మద్దతు ఇచ్చిన ఓటు బ్యాంకు ఇది. జులై 3న లోకల్ సర్కిల్స్ విడుదల చేసిన కొత్త సర్వే ప్రకారం, ఢిల్లీ వాహన యజమానులలో ఎక్కువ మంది (79 శాతం) ‘పాత వాహనాలకు ఇంధన నిషేధం’ నియమాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆచరణయోగ్యమైన శాస్త్రీయ మార్గాలను అనుసరిస్తుందని ఆశిద్దాము.
- చలసాని నరేంద్ర
98495 69050