Saturday, April 20, 2024

‘బతుకమ్మ’ పాటలు.. సామాజిక జీవనం

- Advertisement -
- Advertisement -

జానపద గేయ సాహిత్యంలో ఉయ్యాల (బతుకమ్మ) పాటలది ఒక ప్రక్రియ. ఉయ్యాల పాటలకు బతుకమ్మ పాటలు, బొడ్డెమ్మ పాటలు, దసరా పాటలు అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ప్రత్యేకించి స్త్రీల పాటలే. అయితే ఇవి జోల పాటలు కావు. ఊయల ఊపులాగా ముందుకెల్లి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి, తిరిగి ముందుకు వెళుతూ ఉంటుంది. అందుకే ఈ గేటు ప్రక్రియకు ఉయ్యాల పాట అని పేరు వచ్చింది. రెండు చేతులా చప్పట్లు చరుస్తూ, వంగుతూ లేస్తూ, గుండ్రంగా తిరుగుతూ ఈ పాటలు పాడుతారు. ప్రతి పాదం చివర ‘ఉయ్యాలా లేక ’వలలో’.. అనే వూత్, లేక వంత వుంటూ లయానుగుణంగా పాట సాగుతుంది. గ్రామీణ జానపదుల విశ్వాసాల నుండి నిష్కల్మష నిర్మల హృదయ క్షేత్రాల నుండి మొగ్గ తొడిగినవే ఈ జానపద పాటలు. వీటికి మన తెలుగు నేలే పుట్టిల్లు. ప్రజా జీవనంలో చైతన్యంలో భాగమైన ఈ ఉయ్యాల పాటలు నేటి అధునిక జీవన శైలి, డిష్ యాంటినా, నెట్, విష సంస్కృతి వలయంలో చిక్కుకొని తమ ఉనికినే కోల్పోతున్నాయి. అయితే మన ఆచార సాంప్రదాయాలు, మనం చేసుకునే పండుగలు ఈ పాటలకు చిగురుతొడగడం ఆనందదాయకం.

తెలంగాణ ప్రాంతంలో ‘బతుకమ్మ పాటలు’ ఆంధ్ర ప్రాంతంలో ‘గొబ్బెమ్మ పాటలు’ ప్రాచుర్యం పొందాయ్. తెలంగాణలో బతుకమ్మ పాటలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. శ్రీలక్ష్మీదేవియు చందమామా- సృష్టి బ్రతుకమ్మయ్యే చందమామ / పుట్టినా రీతి చెప్పే చందమామ-భట్టు నరసిమ్హ కవి చందమామ.. అనే పాట బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాలను తెలియజేస్తుంది. ఈ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకూ తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. వెడల్పయిన పళ్లెం మీద గుమ్మడాకులు పరిచి వాని మీద గునుగు, తంగేడు, బంతి వంటి రంగు రంగుల పూలు గోపురాకారంగా పేర్చి స్త్రీలు పూజిస్తారు. చప్పట్లు చరుస్తూ చుట్టూ తిరుగుతూ ఈ పాటలు ఆలపిస్తారు. శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ.. చిత్రమై తోచునమ్మా అంటూ’ తలుపుకు తాళాలు వలలో యెండి చీలాల వలలో.. బతుకమ్మ బతుకు ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఈ పాటలలోని పాదాలు త్రిశ్ర చతురస్ర గతిలో నడుస్తుంటాయి. ఇలాంటివేకాక గౌరి పూజ సందర్భంలో’ రుద్రాక్ష చెట్లల్ల ఆట చిలుకల్లారా, పాట చిలుకల్లారా, కలికి చిలుకల్లార, కొలికి చిలుకల్లారా..

కుందమ్మ గువ్వలు/ నీ నోము నీ కిత్తునే గౌరమ్మ -నా నోము ఫలమివ్వవే.. అంటూ స్త్రీలు తమ పాటలలో భక్తిని వ్యక్తం చేసేవారు. పండ్లు అమ్ముకునే సందర్భంలోనూ’ బండికి తగ్గట్టు కోడెల మరిచి -కోడెలకు తగ్గట్టు గొలుసుల మరిచి/ గొలుసులకు తగ్గట్టు గజ్జెల మరిచి/ ఆ బండిబాయేనే భద్రాద్రి దనుక-భద్రాద్రి రాముల పండ్లోయి పండ్లు- చూసేవారే గాని కొనేవారు లేరూ అని పాడేవారు. ఉయ్యాల పాటల్లో ‘శ్రీరామ నీ తల్లి ఉయ్యాలో.. ప్రేమతో శాంతమ్మ ఉయ్యాలో.. పిలిచి దెగ్గర తీసి ఉయ్యాలో.. సతి ధర్మము కొన్ని ఉయ్యాలో /చెప్పను ఈ రీతి ఉయ్యాలో -చెవులకు ఇంపుగా ఉయ్యాలో’అంటూ ఇలా జానపదులు తమ ఉయ్యాల పాటల్లో దేవతలను స్తుతించేవారు. ఉయ్యాల పాటల్లో అనేక విషయాలతో పాటు సామాజిక జీవన చిత్రణ సైతం ఆయా సందర్భాలలో కనబడుతుంది. వీర కృత్యాల వల్ల, దొమ్మిల వల్ల , నిరంకుశత్వాన్ని ఎదిరించటం వల్ల, సహగమనాధికారాలాను నెరవేర్చడం వల్ల ప్రసిద్దమై, హృదయాలను ఆకర్షించిన సంఘటనలను కథా వస్తువుగా గైకొని గానం చేసిన సందర్భాలు కనిపిస్తాయి.

పితృ, మాతృస్వామ్యాల మధ్య చెలరేగిన ద్వేషాన్ని కొన్ని గేయాలు ప్రచ్చన్నంగా తెలుపగా, అతి ప్రాచీన మాతృసామ్య వ్యవస్థ ఉత్పత్తి పరిణామ పతనాలను శివశంఖు కథలోని ఉయ్యాల పాటలో వ్యక్తమవుతుంది. ‘తెల్లని గుడ్లాకు ఉయ్యాలో -తెచ్చేరగుతాలు /ఎర్రనీ గుడ్లకు- ఎత్తేసే కోపాలు /నిలువునా పానంబు.. అంటూ సాగుతుంది. వారికి జీతభత్యాలు రాజులిచ్చేవారు. ఈ వివరాలు ఇలా కామయ్యాగాద ఉయ్యాలో.. దండు యెల్లేనమ్మ ఉయ్యాలో అంటూ వాస్తవికతను వివరిస్తుంది. అత్తగారి ఆరడికి ఒకానొక కోడలు పడే ఆక్రందనను ఈ జానపద సాహిత్యంలోని పాట చక్కగా విశదపరుస్తుంది. ‘కొడలా కోడలా కొలికి ముత్యమా/ పచ్చనీ పాల మీది మీగడేమాయే- కడిపాల మీది వెన్నెలేమాయే /తేనె కుండ మీది తెప్పలేమాయే -నూనే కుండ మీది నురుగులేమాయే.. అంటూ సాగుతుంది.‘ఇద్దరక్కజెల్లెండ్ల్ ఉయ్యాలో/ ఒక్క ఊరికిస్తే ఉయ్యాలో / ఒక్కడే అన్నయ్య ఉయ్యాలో/ వచ్చన్నబోడు ఉయ్యాలో’ అంటూ సాగే పాట ఆడపిల్లలకు అన్నపై ఉండే ప్రేమతో పాటు ఆనాటి చేతివృత్తులను, నేత పనితనాన్ని తెలియజేస్తుంది.

‘బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ /బిడ్డాలెందరాయె కోల్ /నీ బిడ్డ నీలగౌరు కోల్ /నిచ్చెమల్లే చెట్టేసే కోల్’ అంటూ సాగే ఈ పాటలో పెరుగుతున్న చెట్టుకు, ఆడపిల్ల పోలిక చెబుతూ దేవుళ్లందరినీ గుర్తుకు చేసుకోవడం గమనిస్తాం. ఏ రాజు కురిపించే వలలో ఏడు గడియెల్లు వలలో అనే పాటలో బాలలు.. బతుకమ్మ పండుగను అడిగినట్లుగా పాట సాగుతుంది. ‘కలవారి కోడలు ఉయ్యాలో /కలిగి మహాలక్ష్మీ ఉయ్యాలో/కడుగుతున్నది పప్పు ఉయ్యాలో/ కడవలో బోసే ఉయ్యాలో’ అనే పాటలో అత్తారింటిలో ఆడపిల్లల వెతలను తెలియజేస్తుంది. శ్రీరామునీ తల్లి ఉయ్యాలో /శ్రీమతి కౌసల్య ఉయ్యాలో పాటలో అత్తారింటిలో కోడలు ఏ విధంగా వుండాలో చక్కగా తెలియజేస్తుంది. ఉయ్యాల పాటల ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టాయి గనుకనే బతుకమ్మ పాటలు సాంస్కృతిక చిహ్నంగానే కాకుండా తెలంగాణ ఉద్యమానికి ఊపిరయ్యింది. సామాజిక జీవనంలో ఉయ్యాల పాటలు ప్రధాన భూమికను పోషించాయి. యక్షగానాలు, చిరుతల రామాయణం, కోలాటాలు, చిందుభాగవతం, ఒగ్గుకథ, బుర్రకథ, హరికథ వంటివి జానపద సాహిత్యంలో గుర్తుంచుకోదగినవి. సామ్రాజ్యవాద విష సంస్కృతి ప్రభావంతో నేడు ఈ కళా సంపద కనుమరుగయ్యే ప్రమాదం వాటిల్లుతోంది. ఈ జానపద సాహిత్యాన్ని విపత్కరమైన ఈ కాలంలోనూ… కాపాడుకోవల్సిన అవసరం తెలంగాణ వారసులుగా మనందరి మీద వుంది

డా. కటుకోఝ్వల రమేష్
9949083327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News