కులగణనకు అనుగుణంగా కాంగ్రెస్‌లో
పదవులు పిసిసి కార్యవర్గ కూర్పులోనూ
బిసిలకే పెద్దపీట? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు
పనితీరు ఆధారంగా పోస్టింగ్ రానున్న
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని
పక్కా వ్యూహంతో ముందుకెళుతున్న సిఎం
రేవంత్, పిసిసి అధ్యక్షుడు పిసిసి కమిటీల్లో
సామాజిక సమీకరణలు ఉండేలా ప్రణాళికలు
మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ లేదా అధికార పదవులు కులగణనకు ముందు ఒక మాదిరిగా కులగణన తర్వాత మరో మాదిరిగా తయారయ్యింది. ఇప్పుడు తమ జనాభాకు అనుగుణంగా పదవులు ఇవ్వాల్సిందేనని బిసి నాయకులు డిమాండ్ చేస్తుండగా ఇ దే అదునుగా అటు ప్రత్యర్థి పార్టీలు, కుల సంఘాలు కూడా బిసిల కు తగినన్నీ పదవులు ఇవ్వాలని, తమ వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై అటు ఏఐసిసి, పిసిసి చీఫ్, సిఎం రేవంత్ రెడ్డిలు పక్కా ప్రణాళికతో ముందుకెళుతు న్నట్టుగా తెలిసింది. ముందుగా పిసిసి కార్యవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు సమన్యాయం చేయడంతో పాటు మంత్రి పదవి దక్కని వా రికి ఉన్నతమైన పదవులను అప్పగించేలా పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్ ఆచితూచి జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలిసింది.
ఇక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.. ప్రధాన కార్యదర్శి పోస్టుకు సంబంధించి గత కార్యవర్గంలో జంబో ప్యాక్ మాదిరిగా సుమారు 90 మంది స భ్యులు ఉండేవారు. ఈసారి ఆ సంఖ్యను కుదించబోతున్నారన్న చ ర్చ జరుగుతోంది. కొత్త కార్యవర్గంలో జిల్లాకు ఇద్దరిచొప్పున పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశం కల్పించనున్నట్లుగా తెలిసింది. వీటితో పాటు పిసిసి సెక్రటరీలు, అధికార ప్రతినిధుల విషయంలోనూ ఆచితూచి జాబితాను రూపొందించినట్టుగా సమాచారం. కింది స్థాయి పోస్టులను కూడా చాలా ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడే వారికి దక్కే అవకాశం ఉందని, అందులోనూ బిసిలకు అధిక ప్రాధాన్యంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా పిసిసి కార్యవర్గ కూర్పు జరిగిందని తెలుస్తోంది.
బిసి నేతలకే అవకాశాలు దక్కాలని
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణనలో ముస్లింలతో సహా బిసిలు 56.32 శాతం (బిసిలు 46.25 శాతం, ముస్లిం బిసిలు 10.08 శాతం) ఉన్నారు. దీంతోపాటు ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, కాగా, ముస్లింలలోని ఓసిలు 2.48 శాతం కలుపుకొని మొత్తం ఓసీలు 15.79 శాతం ఉన్నట్లు లెక్కతేల్చింది. ఇప్పుడు ఇదే లెక్కన పిసిసి కమిటీల్లో సామాజిక సమీకరణాలు ఉండాలని కాంగ్రెస్‌కు చెందిన వివిధ కులాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత సామాజిక సమీకరణాలను బట్టి రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న బిసి నేతలకే అవకాశాలు దక్కాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు డిమాండ్ చేస్తుండడంతో పాటు ఇది కేవలం పార్టీ పదవుల్లోనే కాకుండా అధికార పదవులకు సైతం వర్తింపజేయాలని వారు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్టుగా సమాచారం.
అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా
ప్రధానంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు పిసిసి తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకంగా మారింది. పిసిసి ఏర్పాటు చేసిన అబ్జర్వర్లు ఆయా నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తల పనితీరు ఆధారంగా నివేదికను పిసిసి అధ్యక్షుడికి గతంలో అందచేశారు. అబ్జర్వర్లు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా కొందరికి పిసిసి కార్యవర్గంలో పోస్టులు దక్కే అవకాశం ఉందని సమాచారం.
లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టేలా….
దీంతోపాటు పిసిసి కార్యవర్గ కూర్పులో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధికంగా అవకాశం కల్పించి లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టాలని పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్‌లు భావించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే పిసిసి కూర్పులో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన కాంగ్రెస్ నాయకులకు వారి సమర్ధత ఆధారంగా ఈ పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తొంది. వీలైనంత త్వరగా పార్టీ పదవులు అప్పచెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలిచేలా సిఎం రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ప్రణాళికలను సిద్ధం చేసినట్టుగా తెలిసింది. పిసిసి కూర్పులో అవకాశం రాని వారికి మిగిలిన 40 కార్పొరేషన్ పదవులు, పలు కమిషన్‌లలో 30 పోస్టులు కలిపి మొత్తం 70 మందికి అవకాశం కల్పించేలా సిఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు వ్యూహారచన చేసినట్టుగా తెలిసింది.