Monday, August 25, 2025

హస్తిన వెళ్లి.. న్యాయ కోవిదుల సలహాలు తీసుకోండి

- Advertisement -
- Advertisement -

అడ్వకేట్ జనరల్‌కు సూచించిన మంత్రుల కమిటీ

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేంచుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు హస్తినకు వెళ్ళి న్యాయకోవిదులను సంప్రదించాలని రాష్ట్ర మంత్రుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డికి సూచించింది. బిసి రిజర్వేషన్లకు సంబంధించి మంత్రుల కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.

అయితే అడ్వకేట్ జనరల్ ఢిల్లీకి వెళ్ళి నిష్ణాతులైన ప్రముఖ న్యాయకోవిదులను కలిసి చర్చించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని మంత్రులు భావించారు. దీంతో పొన్నం ప్రభాకర్ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డికి ఫోన్ చేసి మంత్రుల కమిటీ నిర్ణయాన్ని తెలిపారు. దీంతో సుదర్శన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇదిలాఉండగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ శనివారం గాంధీ భవన్‌లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రభృతులు హాజరైన సంగతి తెలిసిందే. బిసి రిజర్వేషన్ల అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశాన్ని చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేతృత్వంలో మంత్రుల ఉప సంఘం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ ఉప సంఘం ఈ నెల 26వ తేదీలోగా నివేదిక సమర్పించాల్సి ఉండడంతో, ఆదివారం ప్రజా భవన్‌లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కమిటీ మరోసారి సమావేశమై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఈ నెల 29న జరగబోయే మంత్రివర్గ సమావేశాలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.
ఎన్నికలకు ముందు బిసిలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తున్నది. బిసిలకు రిజర్వేషన్లు కల్పించినట్లయితే వారికి సామాజిక, ఆర్థిక రంగాలతో పాటు విద్యా, ఉద్యగ రంగాల్లోనూ ఎదిగేందుకూ అవకాశం కల్పించినట్లు అవుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. స్థానిక సంస్థలకు వచ్చే నెల 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఎన్నికల నిర్వహణకు ముందే బిసి రిజర్వేషన్లు సాధించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News