వన్డే ప్రపంచకప్ కోసం మహిళా టీమ్ ఎంపిక
ముంబై: మహిళల వన్డే వరల్డ్‌కప్ కోసం టీమిండియాను ఎంపిక చేశారు. భారత్, శ్రీలంక దేశాలు ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు ప్రత్యర్థితో ఓ మ్యాచ్‌లో తలపడుతుంది. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. కాగా, చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల అక్టోబర్ 5న పోరు కొలంబో వేదికగా పోరు జరుగనుంది. కాగా టోర్నమెంట్ కోసం 15 మందితో కూడిన టీమ్‌ను సెలెక్టర్లు మంగళవారం ఎంపిక చేశారు. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు జట్టులో చోటు దక్కలేదు. కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న స్టార్ క్రికెటర్ రేణుకా ఠాకూర్ జట్టులో చోటు సంపాదించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
స్మృతి మంధానను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్ తదితరులు జట్టులో చోటు సంపాదించారు. కానీ అనూహ్యంగా వరల్డ్‌కప్ టీమ్‌లో షఫాలీకి చోటు దక్కలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన షఫాలీకి సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. ఆమెను మెగా టోర్నీలో పాల్గొనే జట్టులో చోటు లభించక పోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్నేహ్ రాణా, అరుంథతి రెడ్డి, దీప్తి శర్మ, రిచా ఘోష్, ప్రతికా రావల్, హర్లిన్ డియోల్, యస్తికా భాటియా, అమన్‌జోత్ కౌర్ తదితరులు జట్టులో స్థానం దక్కించుకున్నారు. స్టాండ్ బైలుగా ప్రియా మిశ్రా, ఉమా ఛెత్రి, మన్ను మణి, సయాలి సత్గారె, తేజల్ హసబ్‌నిస్, ప్రేమ రావల్ ఎంపిక కయ్యారు. కాగా, వరల్డ్‌కప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 30న శ్రీలంకతో ఆడనుంది. మరోవైపు ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా ఆస్ట్రేలియా మహిళా టీమ్‌తో మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 14 నుంచి 20 వరకు జరగనుంది. తొలి రెండు వన్డేలు చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లో, చివరి వన్డే ఢిల్లీలో జరుగుతాయి.
వరల్డ్‌కప్ జట్టు ఇదే:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లిన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీచరణి, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్.