భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit And Kohli) గత ఏడాది టి-20లకు, ఇటీవలే టెస్ట్‌లకు ఒకేసారి రిటైర్‌మెంట్ ప్రకటించారు. బిసిసిఐ, కోచ్ గౌతమ్ గంభీర్‌లలో వీరిద్దరికి విబేధాలు ఉన్నాయని.. అందుకే త్వరగా రిటైర్‌మెంట్ ప్రకటించారని పుకార్లు కూడా ఉన్నాయి. అయితే తాజాగా వీరిద్దరికీ బిసిసిఐ మరో షరతు పెట్టినట్లు తెలుస్తోంది. 2027లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొని ప్రపంచకప్‌ను అందుకోని వన్డేలకు ఘనంగా గుడ్‌బై చెప్పాలని రోహిత్, కోహ్లీలు అనుకుంటున్నారు. కానీ, బిసిసిఐ మాత్రం ఈ మెగా టోర్నీలో పాల్గొనాలంటే.. వీరిద్దరికి ఓ కఠిన నిబంధన పెట్టినట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
తమ ఫిట్‌నెస్, ఫామ్‌ని నిరూపించుకునేందుకు.. ఈ క్రికెటర్లను దేశవాళీ వన్డే ఫార్మాట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాలని బిసిసిఐ కండీషన్ పెట్టిందట. ఈ టోర్నమెంట్ డిసెంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఈ టోర్నమెంట్‌లో విరాట్, రోహిత్‌లు (Rohit And Kohli) పాల్గొని తమ సత్తాను నిరూపించుకోవాలి. అప్పుడే ప్రపంచకప్ స్క్వాడ్‌లో ఉండేందుకు అర్హత పొందుతారు. లేని పక్షంలో దారులు మూసుకుపోయినట్లే అని తెలుస్తోంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లనే జట్టులో ఉంచేందుకు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వ్యూహాలు రచిస్తున్నారట. ఇప్పటికే ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సిరీస్‌లో పాల్గొనే అవకాశాన్ని విరాట్, రోహిత్‌కు ఇవ్వకపోవడంతోనే వాళ్లిద్దరూ రిటైర్‌మెంట్ ప్రకటించారని.. ఈ క్రమంలో గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారని రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ విషయంలోనూ అదే జరుగుతుందని టాక్.
ఇక కొద్ది రోజుల్లో విరాట్, రోహిత్‌ల వన్డే భవితవ్యం తేలనుంది. మరో రెండు నెలల్లో భారత్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్‌లో జట్టులో వీరిద్దరి ఆట తీరును గమనించే అవకాశం ఉంది. అసలు ఈ సిరీస్‌కి వీరిద్దరిని ఎంపిక చేస్తారా? అనే సందేహాలు కూడా ఉన్నాయి. మరోవైపు కొన్ని రోజుల విరామం తర్వాత విరాట్ మళ్లీ క్రికెట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. రోహిత్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు.