అధ్యాపకులు తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ గ్రేటర్ నోయిడాలో ఓ ప్రైవేటు యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని తన హాస్టల్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది. చాలా కాలంగా అధ్యాపకులు తనను మానసికంగా వేధిస్తున్నారని, దీన్ని భరించలేనని ఆమె రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌లో ఆరోపించింది. కాగా పోలీసులు ఆ ఇద్దరు అధ్యాపకులను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుర్గావ్‌కు చెందిన జ్యోతిశర్మ అనే యువతి స్థానిక ప్రైవేటు యూనివర్సిటీలో బిడిఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆ యువతి తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. యువతి గదిలో ఓ సూసైడ్ నోట్ దొరికిందని, అందులో డెంటల్ విభాగానికి చెందిన ఓ మహిళా లెక్చరర్,
మరో అధ్యాపకుడు తనను మానపికంగా వేధిస్తున్నట్లు పేర్కొందని పోలీసులు తెలిపారు. నిందితులకు శిక్ష పడాలని, వారు కూడా తనలాగే మానసిక క్షోభ అనుభవించాలని తాను కోరుకొంటున్నట్లు ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు గ్రేటర్ నోయిడా అదనపు డిసిపి సుధీర్ కుమార్ చెప్పారు. ఈ ఘటన అనంతరం యూనివర్సిటీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇదిలా ఉండగా నిందితులు ఇద్దర్నీ సస్పెండ్ చేసినట్లు యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ అజిత్ కుమార్ చెప్పారు.ఈ విషయంపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు, కమిటీ నివేదిక ఆధారంగా దోషులపై చర్య తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు.