ప్రముఖ మలయాళ నటుడు, దసరా సినిమా విలన్ షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) ఇంట కొద్ది రోజుల క్రితం తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా.. ఆయన తండ్రి సిపి చాకో మృతి చెందారు. ఆ విషాద సంఘటన గురించి షైన్ టామ్ చాకో తాజాగా స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ దుర్ఘటనను ఎప్పటికి మర్చిపోలేనని పేర్కొన్నారు.
కారులో తన తల్లిదండ్రులతో పాటు తన సోదరుడు కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. ‘‘నేను వెనకాల సీట్లో కూర్చొని నిద్రపోతున్నాను. రెండు, మూడు సార్లు లేచి నాన్నతో మాట్లాడుతూ.. పడుకున్నాను. ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను. నాకు ఏమీ అర్థం కాలేదు. మేమంతా రోడ్డు మీద ఉన్నాము. మా అమ్మ షాక్‌కి గురయ్యారు. ‘మనం ఎక్కడ ఉన్నాం.. ఎక్కడికి వెళ్తున్నాం’ అని ఆమె ప్రశ్నిస్తోంది. నాన్న ఎన్ని సార్లు పిలిచినా పలకలేదు. యాక్సిడెంట్ల గురించి వినడం, చూడటం తప్ప తొలిసారి అలాంటి ఘటనను ఎదురుకున్నాను. ‘దయచేసి ఎవరైనా సాయం చేయండి’ అంటూ రోడ్డు మీద ఏడ్చాను’’ అని షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) తెలిపారు.
ఆరోగ్య పరమైన కారణాల దృష్ట్యా కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నానని.. దాని వల్ల ఎక్కువ సేపు నిద్రలో ఉంటున్నానని ఆయన అన్నారు. అందుకే ప్రమాదం ఎలా జరిగిందో తనకు గుర్తు లేదని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తనకు సుమారు 30 కుట్లు పడ్డాయని తెలిపారు. తన తల్లి, సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయన్నారు. తండ్రి మరణం మాత్రం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.