మాంచెస్టర్: భారత్-ఇంగ్లండ్ (Ind VS Eng) మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌పై ఎలాంటి ఆశలు లేని సమయంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల పోరాటం.. చివరకు మ్యాచ్ డ్రా అయ్యేలా చేసింది. ఐదో రోజు 174/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. ఆరంభంలోనే కెఎల్ రాహుల్ (90) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ శతకం సాధించి కొంత సమయానికే ఔట్ అయ్యాడు. ఈ దశలో భారత అభిమానులు మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకున్నారు. కానీ, జడేజా, సుందర్‌లు మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడానికి ఇంగ్లండ్ నానా కష్టాలు పడింది.
అయితే ఈ దశలో విసుగు చెందిన ఇంగ్లండ్ కెప్టెన్ మ్యాచ్‌ని డ్రా చేయాలని జడేజాను ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే జడేజా, సుందర్‌లు సెంచరీకి చేరువలో ఉన్నారు. దీంతో జడ్డూ మ్యాచ్‌ని డ్రా చేసేందుకు అంగీకరించలేదు. దీంతో సహనం కోల్పోయిన స్టోక్స్.. జడేజాతో మితిమీరి ప్రవర్తించాడు. ‘సెంచరీ చేయాలనుకుంటున్నావా..? హ్యారీ బ్రూక్, బెన్ డకెట్‌ల బౌలింగ్‌లో సెంచరీ చేస్తావా..?’ అంటూ కవ్వింపు చర్యలకు దిగాడు. దీనికి జడేజా కూల్‌గా స్పందించాడు. ‘నాకేమీ తెలీదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. అన్నట్లుగానే స్టోక్స్ బెన్ డకెట్‌కి బౌలింగ్ ఇచ్చాడు. అతను గల్లీ క్రికెట్‌లో బౌలింగ్ చేసినట్లు చేశాడు. అయితే అతని బౌలింగ్‌లో సిక్సు కొట్టి సెంచరీ సాధించాడు జడేజా (107).. ఆ తర్వాత రెండు ఓవర్లలో సుందర్ (101) కూడా శతకం బాదాడు. వీరిద్దరు కలిసి 203 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి మ్యాచ్‌ని డ్రా చేశారు.(Ind VS Eng)
అయితే స్టోక్స్ ప్రవర్తనపై సోషల్‌మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు. ఒక కెప్టెన్‌గా ఉండి ఇలా ప్రవర్తించడాన్ని తప్పుబడుతున్నారు. ఒకవేళ తన జట్టు ఆటగాళ్లు ఆ పరిస్థితిలో ఉండి.. ప్రత్యర్థి కెప్టెన్ అలా చేస్తే ఒప్పుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.