ఈ నెల 23న ఐఆర్‌సిటిసి భారత్ గౌరవ్ టూరిస్టు రైలును నడుపుతోందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైలు ఉభయ తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొంది. ఈ నెల 23న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభమై జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, మీదుగా విజయవాడ, తెనాలి, ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొంది. అరుణాచలం, రామేశ్వరం, మధుర మీనాక్షి ఆలయం, కన్యాకుమారి, పద్మనాభస్వామి ఆలయం త్రివేండ్రం, తిరుచ్చి రంగనాథ స్వామి ఆలయం, తంజావూరు బ్రిహదీశ్వర ఆలయం సందర్శన ఉంటుందని ద.మ.రై స్పష్టం చేసింది.
ఈ రైలు ప్రయాణం ఏడు రాత్రులు, 8 పగలు ఉంటుందని పేర్కొంది. ఈ ప్రయాణానికి ఎకానమీ (స్లీపర్) ధర రూ.14,100, స్టాండర్డ్ (ధర్డ్ ఏసి) ధర రూ.22,500, కంఫర్ట్ (2ఏసి) ధర రూ.29,500 మేరకు చార్జీలు ఉంటాయని తెలిపింది. ఈ ప్రయాణంలో రోడ్డు, రైలు ప్రయాణం కవర్ అవుతుంది, అలాగే అన్ని చోట్ల బస సౌకర్యం, ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నాం భోజనం, రాత్రి భోజనం ఆన్ బోర్డు, ఆఫ్ బోర్డు సమయాల్లోనూ ఐఆర్‌సిటిసి భరిస్తుందని పేర్కొంది. దీంతో పాటు అన్ని కోచ్‌లకు సిసి కెమెరాలు, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుందని, టూర్ మేనేజర్లు బయలు దేరినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు సహాయంగా ఉంటారని ద.మ.రై ఆ ప్రకటనలో తెలిపింది.
Also Read: జిహెచ్‌ఎంసి, హైడ్రాకు హైకోర్టు నోటీసులు