కేంద్ర హోం మంత్రి అమిత్ షా గౌహతీలో మాట్లాడుతూ, చొరబాటుదారులను రక్షించేవారు అసోంను పాలించలేరని విలక్షణమైన ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్రను ఘుసోటియా (చొరబాటుదారుల) అధికార యాత్రగా పేరు మార్చాలంటూ ఎద్దేవా చేశారు. ఆ ప్రకటన పార్టీ వర్గాల నుంచి హర్షధ్వానాలు తెచ్చిపెట్టవచ్చు. కానీ అది ఆయన హిపోక్రసీ తప్ప మరేమీ కాదు. చొరబాటు అనే పదాన్ని అధికార రాజకీయాలకు ఒక సాధనంగా మార్చిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయే. దశాబ్దాలుగా అక్రమ వలసల సమస్య అసోంను కుదిపివేస్తున్నది. ఆరేళ్లపాటు జరిగిన అసోం ఆందోళన 1995 అసోం ఒప్పందంతో ముగిసింది. ఇది రాష్ట్ర జనాభా సమతుల్యతను కాపాడేందుకు ఇచ్చిన ఓ గొప్ప హామీ పత్రం. దాని ప్రధాన నిబంధన సుస్పష్టంగా ఉంది.
1971 మార్చి 25 తర్వాత బంగ్లాదేశ్ నుంచి అసోంలోకి ప్రవేశించిన వారందరినీ, వారి మతంతో సంబంధం లేకుండా బహిష్కరించాలన్నదే ప్రధాన నిబంధన. అధికారంలో ఉన్న ఏ పారీకీ ఆ నిబంధనను నీరుగార్చే నైతిక హక్కు లేదు. అయినా, ఒప్పందాన్ని అక్షరాలా పూర్తి స్ఫూర్తితో అమలు చేస్తామని హామీతో అసోంలో అధికారంలోకి వచ్చిన బిజెపి పూర్తిగా అందుకు విరుద్ధంగా చేసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిర్వహించిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) కసరత్తు పౌరసత్వం ప్రశ్నకు చివరి జవాబుగా ప్రచారం జరిగింది. చాలా ఏళ్ల కసరత్తు తర్వాత తుది జాబితానుంచి దాదాపు 19 లక్షల మంది పేర్లు తొలగించబడ్డాయి. వీరిలో బంగ్లాదేశ్ నుంచి సరిహద్దు దాటి భారతదేశంలోకి వచ్చిన హిందువులే ఎక్కువ.
బిజెపికి ఇది రాజకీయంగా అసౌకర్యంగా ఉంది. బిజెపి ఎల్లప్పుడూ ముస్లింలను చొరబాటుదారులుగా, హిందువులను శరణార్థులుగా చిత్రీకరించింది. కానీ ఎన్‌ఆర్‌సి వాస్తవికత ఈ అపోహను తుంగలోకి తొక్కింది. దీంతో దీనిని అంగీకరించే బదులు ఆ పార్టీ పౌరసత్వ చట్టాన్ని సవరించేందుకు తొందరపడి, అపఖ్యాతి పాలైన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను తీసుకువచ్చింది. పొరుగుదేశాల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వడం ద్వారా, అసోం ఒప్పందం ప్రకారం బహిష్కరించాలని డిమాండ్ చేసిన చొరబాటుదారులను కచ్చితంగా చట్టబద్ధం చేసేందుకు బిజెపి ప్రయత్నించింది. ఆరేళ్ల పాటు రూ. 1600 కోట్లు ఖర్చు చేసిన తర్వాత సవరించిన ఎన్‌ఆర్‌సిని సవరించాలని బిజెపి పట్టుబట్టింది.
ఒకపక్క అమిత్ షా చొరబాటుదారులను రక్షించడం కోసం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తుండగా, ఆయన పార్టీ ప్రభుత్వం, చట్టం ఆధారంగా కాకుండా, మతపరమైన గుర్తింపు ఆధారంగా ఎంపికచేసి రక్షించడంలో బిజీగా ఉంది. అసోం పోరాటానికి ద్రోహం జరిగింది. తమ భూమిని, సంసృ్కతిని కాపాడుకునేందుకు డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనలో వేలాది మంది అస్సామీ యువకులు ప్రాణాలను అర్పించారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆల్ అసోం స్టూడెంట్ యూనియన్ (ఆసు) ఈ ఒప్పందంపై చిత్తశుద్ధితో సంతకం చేసింది. ఈ రోజుకీ ఆసు 1971 తర్వాత వచ్చిన హిందువులు, ముస్లింలు అందరూ అసోం నుంచి తప్పనిసరిగా వెళ్లాలని దృఢంగా చెబుతోంది. కానీ, బిజెపి ఎన్నికల్లో ప్రయోజనం కోసం ఒప్పందాన్ని వాడుకుని, ఆ తర్వాత తన మతపరమైన ఎజెండాకు అనుగుణంగా దానిని పక్కనపెట్టింది. 2016 అసోం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి ఈ ఒప్పందాన్ని అక్షరాలా, పూర్తిగా స్ఫూర్తితో అమలు చేస్తామని వాగ్దానం చేసింది.
కానీ, 9 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఒప్పందం కాగితాలకే పరిమితమైంది. దానికి బదులుగా విస్తృత మోసం ఆవిషృ్కతమైంది. భయాన్ని సృష్టించేందుకు ఓ కమ్యూనిటీని చొరబాటుదార్లుగా ముద్రవేయడం, అదే సమయంలో ఇతరులకు చట్టబద్ధతను కల్పించడం. ఇది పాలన కాదు రాజకీయపరమైన మోసం. అసోంలో ప్రస్తుతం నెలకొన్న కఠినమైన నిజం ఏమిటంటే, చొరబాటుదారులు అనే సాకు బెంగాలీ మాట్లాడే ముస్లింలను బయటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి ఓ ఆయుధంగా మారింది. ముస్లింలే లక్ష్యంగా చేసుకుని ప్రచారం సాగిస్తూ, సామూహిక తొలగింపులు ఓటర్ల పేర్ల తొలగింపు ఘుస్పేటియాస్ అనే ముద్రవేసి ప్రచారం నిరంతరం సాగుతోంది. మరీ దారుణం ఏమిటం, ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలను బుల్డోజర్ల ద్వారా వెళ్లగొట్టే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.
వారికి పునరావాసం లేకుండా చేసింది. ర్యాలీలలో బిజెపి నాయకులు చొరబాటు దారులను కొట్టడం, దాడి చేయడంతోపాటు, గట్టి గుణపాఠం నేర్పిస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. అధికార పక్షం అనుమతితోనే జనాల్ని రెచ్చగొట్టే పని సాగుతోంది. ఇంత చేస్తున్నా ఒక్క చొరబాటుదారుడిని కూడా దేశం నుంచి బహిష్కరించలేదు. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో దౌత్యపరమైన ఒప్పందం కోసం కృషి చేయలేదు. బహిష్కరణలను అమలు చేసేందుకు ఓ యంత్రాగాన్ని ఏర్పాటు చేయలేదు. అందుకు కారణం చొరబాటుదారుడు శాశ్వత ఎన్నికల సమయంలో దిష్టబొమ్మలా చాలా ఉపయోగపడుతూ ఉండడమే. లక్షలాది మందికి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులను జారీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆ పత్రాలను అదే ప్రభుత్వం పౌరసత్వం రుజువుగా అంగీకరించడానికి నిరాకరిస్తోంది.
ఇది అనుమానాలకు తావు ఇస్తోంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? విశ్వాసంతో ఆ పత్రాలు అంగీకరించిన సామాన్యుడా? వాటిని జారీ చేసిన అధికారులా? పేదలకు ఓటు హక్కు లేకుండా చేస్తూ బిజెపి తన నిజమైన లక్ష్యాన్ని బయటపెట్టింది. సరిహద్దుల భద్రతే కాదు, దానికి మద్దతు ఇవ్వని వర్గాల ఓటరు జాబితాపై కోతపెడుతున్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఈ ఆటలో భాగస్వామిగా మారింది. పారదర్శకత లేకుండా పేర్లను కొట్టివేసింది. తటస్థంగా ఉండడానికి బదులు అధికార పార్టీకి పావుగామారి జనాభా గణన అమలు చేసేదిగా కన్పిస్తోంది. అసోం ప్రయోగం ఆ రాష్ట్రానికే పరిమితం కాదు. ఇది జాతీయ వ్యూహంలో భాగం, ఇక్కడ బిజెపి సిద్ధాంతం లేదా విధానంపై ప్రతిపక్ష పార్టీలతో పోరాడానికి ఇష్టపడదు. కానీ, ప్రజాస్వామ్య నియమాలను తారు మారు చేస్తుంది. ఇటీవలి చట్టాలు చూడండి ఏ కోర్టు కూడా వారిని దోషులుగా నిర్ధారించకపోయినా, ఒక నెల కన్నా ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులను అనర్హులుగా ప్రకటించడానికి అనుమతించే నిబంధన.
ఇది సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమే. ఏ ప్రజాస్వామ్యంలోనైనా కేవలం దోషిగా నిరూపింపబడే వరకూ నిందితుడు నిర్దోషి అనే సూత్రం పవిత్రమైనది. నిర్బంధంలో ఉన్నవారిని దోషితో సమానంగా పరిగణించడం దారుణం. ప్రత్యర్థులపై ఎటువంటి కేసును నిరూపించకుండానే వారిని ఎన్నికల రంగం నుంచి వెళ్లగొట్టడానికి బిజెపి ఒక కొత్త ఆయుధాన్ని సృష్టించింది. సమాంతరంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిఐబి, ఎన్‌ఐఎ వంటి కేంద్ర సంస్థలు ప్రతీకార చర్యలకు సాధనాలుగా దిగజారిపోయాయి. రాష్ట్రాలలో ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేయడం, ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం, నేరస్థులుగా పేర్కొనడం నిత్యకృత్యంగా మారాయి. కొన్ని కేసులు న్యాయస్థానం ముందు పరీక్షలకు నిలబడతాయి. కానీ అధికార పక్షం లక్ష్యం మాత్రం న్యాయకాదు. ప్రత్యర్థులను బెదిరించడం, అనర్హులను చేయడమే.
ఒకప్పుడు ప్రతిష్టాత్మకంగా నిలిచిన ఎన్నికల కమిషన్ నేడు కేవలం ఓ నీడలా మారిపోయింది. అధికార పార్టీ అక్రమాలపై చర్య తీసుకోవడానికి ఇష్టపడకుండా కేవలం, ప్రతిపక్ష పార్టీలపై సాంకేతిక సాకులతో విరుచుకుపడడం సంస్థాగతంగా ఎంత దిగజారిపోయిందో సూచిస్తోంది. ఈ పరిణామాలను గమనిస్తే బిజెపి రాజకీయ ప్రాజెక్టు చర్చ ద్వారా, ప్రజాస్వామ్య ఏకాభిప్రాయం ద్వారా నిర్మింతం కాలేదని స్పష్టమవుతోంది. బిజెపి రాజకీయ ప్రాజెక్టు 1 ప్రతిపక్షాల ఓటర్లను తొలగించడం, 2 మతపరమైన చట్టం ద్వారా ఎంపిక చేసుకున్న చొరబాటు దారులను చట్టబద్దం చేయడం, 3, వక్రీకరించిన చట్టపరమైన నిబంధనల ద్వారా ప్రతిపక్ష నాయకులను అనర్హులను చేయడం, 4 ప్రతిపక్షాలను వేధించడం, నోళ్లు నొక్కడం, ఏజెన్సీలను ఆయుధాలుగా మార్చుకోవడం, 5 తటస్థంగా నిలిచే సంస్థలను అణగదొక్కడం అన్న సూత్రాలనే అనుసరిస్తున్నట్లు కన్పిస్తోంది. ఫలితంగా అధికారపార్టీ జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటోంది.
ప్రతిపక్షం నిరంతరం ఆందోళనలు, ముట్టడితో రంగంలో నిలుస్తోంది. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం సహజ పరిణామం కాదు. నిరంకుశత్వాన్ని ఉద్దేశపూర్వకంగా రుద్దడమే. అమితి షా చొరబాటుదారులపై రంకెలు వేయవచ్చు. కానీ, అంతకంటే అతిపెద్ద చొరబాటు భారత ప్రజాస్వామ్య సంస్థలోకి నిరంకుశత్వం చొరబడడం. అందుకు అసోం నేడు ఒక ప్రయోగశాల. తర్వాత వరుసలో బీహార్, బెంగాల్, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపులు, ఎంపిక చేసిన చట్టాలు, ఏజెన్సీల ఆధారంగా బెదిరింపులను కొనసాగించిన నాడు ప్రజాస్వామ్యం పునాదులు బలహీనపడిపోతాయి. గుర్తింపును కాపాడుకోవడం విలువ అందరికంటే బాగా తెలిసిన అసోం ప్రజలు తమను తాము ఇలా ప్రశ్నించుకోవాలి. వారు పోరాడి, పొందాలనుకున్న రక్షణ ఇదేనా అని.
ప్రస్తుతం అసోంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రేపు తమ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడ వచ్చునని భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు గ్రహించాలి. భారత స్వాతంత్య్ర పోరాటం అత్యున్నత ఆశయాలతో సాగింది. అది మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్వహించే, రాజకీయాల కోసం ఓటర్ల జాబితాల నుంచి అమాయకులను తొలగించే, పోటీ కారణంగా నాయకులను జైలులో పెట్టే దేశం కోసం కాదు. సహజ న్యాయం, న్యాయమైన పాలన అందించే, ప్రజాస్వామ్యం కోసం సాగిన మహాయజ్ఞం. బిజెపి తన కపటత్వం, నిరంకుశ వ్యూహాలతో ఆ దార్శికతకు ద్రోహం చేస్తోంది. నిజమైన ప్రమాదం సరిహద్దు వద్ద చొరబాటు దారుడు కాదు. దేశం లోపల ప్రజాస్వామ్యం క్షీణింపబడడం.
Also Read : రైతులకు కూలీ ఖర్చులు కూడా రావడం లేదు: వైఎస్ జగన్
- గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
- రచయిత ఈశాన్య రాజకీయాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు