Friday, August 22, 2025

మహిళా పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది:భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

మహిళా పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, మూడు రోజుల సదస్సు ద్వారా మహిళా సిబ్బంది సంక్షేమానికి చేసే సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. నియామక సమయంలో లేని లింగ వివక్ష విధుల్లో చూపడం సరైనది కాదని, మహిళ పోలీసులో మహిళా అనే పదాన్ని తొలగించాలన్న సిఫారసు మంచి ఆలోచనని , రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ సిఫారసుతో తాను ఏకీభవిస్తున్నానని వెల్లడించారు. నియామక సమయంలో లింగ వివక్ష లేకుండా ఎంపిక చేస్తున్న నేపథ్యంలో విధుల్లో కూడా సమానంగా చూడాలన్న ప్రతిపాదన సరైందేనని అభిప్రాయపడ్డారు. మహిళా సిబ్బంది వ్యక్తిగత అవసరాలు, యూనిఫామ్ అవసరాలు అన్ని అమలు చేయదగినవే అవేమి గొంతెమ్మ కోరికలు కాదన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది సమస్యలపై త్వరితగతిన కమిటీ వేసి సైంటిఫిక్‌గా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ప్రజల అవసరాలను తీర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే సిబ్బంది అవసరాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర సిబ్బంది అవసరాలు తీర్చి ప్రజల జీవనస్థితిగతులను ఏరకంగా మార్చగలం అన్న భావనతో మానవీయ కోణంలో పరిపాలించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉందన్నారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే, పెట్టుబడులు రావాలి అంటే శాంతి భద్రతలు బాగుండాలి, అప్పుడే పెట్టుబడులు వస్తాయని తెలిపారు. అంకిత భావంతో పనిచేసే పోలీసు సిబ్బంది ఉన్నప్పుడే అది సాకారం అవుతుంది అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు, ఉత్సవాలు జరిగాయి పోలీసులు జీవితాలను పనంగా పెట్టి చిన్న దుర్ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉందన్నారు. పోలీసు సిబ్బంది శ్రమ రాష్ట్ర అభివృద్ధికి మూలం అన్నారు. పోలీసు సిబ్బంది వ్యక్తిగత సమస్యలతో పాటు శాఖపరమైన అవసరాలు కార్యాలయాల భవనాలు, పోలీస్ స్టేషన్‌లు, సిబ్బంది క్వార్టర్స్ వంటి సమస్యలకు సంబంధించి ప్రతిపాదనలు తీసుకురావాలని పోలీసు అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో విద్యా విధానంలో కొత్త ఒరవడిని ప్రజా ప్రభుత్వం సృష్టిస్తుందని తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో, 200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక్కో స్కూల్ ను ఇంటర్నేషనల్ స్టాండరడ్స్ తో నిర్మిస్తున్నామని తెలిపా రు. రాష్ట్రంలో ఒకేసారి 104 పాఠశాలలు నిర్మిస్తున్నాం అన్నారు. పోలీస్ సిబ్బంది పిల్లలు చదువుకునేందుకు ఒక యంగ్ ఇండియా ఇప్పటికే ప్రారంభించామని అది బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం తెలిపారు. సామాజిక ఒత్తిడి, ఉన్నతాధికారుల ఒత్తిడి, రాజకీయ ఒత్తిళ్ళ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది వారి పిల్లల చదువులపై దృష్టి పెట్టే పరిస్థితి ఉండదు, ఈ విషయంలో తల్లిదండ్రులుగా వారు ఆందోళనలో ఉంటారని గమనించి మంచి విద్యను అందించాలని, పోలీసు పిల్లల భవిష్యత్తు బాధ్యతను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ రాష్ట్రం మనది దీన్ని రక్షించుకునే వాతావరణం ఏర్పాటు చేసేందుకు భవిష్యత్తులోనూ మరిన్ని వర్క్ షాప్ లు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News